Share News

చవకైన నట్స్‌, సీడ్స్‌ ఇవే!

ABN , Publish Date - Jan 27 , 2026 | 05:15 AM

పలురకాల నట్స్‌, సీడ్స్‌ బజార్లో దొరుకుతున్నాయి. కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండిపోయేవాళ్లే ఎక్కువ. కానీ అంతే సమానమైన పోషకాలను కలిగి ఉండే నట్స్‌, సీడ్స్‌...

చవకైన నట్స్‌, సీడ్స్‌ ఇవే!

పోషకాలు - వాస్తవాలు

పలురకాల నట్స్‌, సీడ్స్‌ బజార్లో దొరుకుతున్నాయి. కానీ ఖరీదు ఎక్కువ కాబట్టి వాటికి దూరంగా ఉండిపోయేవాళ్లే ఎక్కువ. కానీ అంతే సమానమైన పోషకాలను కలిగి ఉండే నట్స్‌, సీడ్స్‌ పట్ల అవగాహన పెంచుకుని, వాటిని తీసుకోగలిగితే, పోషకలోపాలను నివారించుకోవచ్చు

బాదం, పిస్తా, జీడిపప్పు, హేజిల్‌ నట్‌... ఇలా అన్ని రకాల నట్స్‌ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. తాజాగా అవిసె గింజలు, గుమ్మడి, పొద్దు తిరుగుడు, తర్బూజా, దోస విత్తనాలు అందించే ఆరోగ్య ప్రయోజనాల పట్ల కూడా అవగాహన పెరిగింది. పీచు, ఐరన్‌ సమృద్ధిగా ఉండే మఖనా (ఫాక్స్‌ నట్స్‌)ల వాడకం కూడా పెరిగింది. అయితే కొన్ని రకాల నట్స్‌, సీడ్స్‌ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ తినడం సాధ్యపడకపోవచ్చు. అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ నట్స్‌, సీడ్స్‌ ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వేరుసెనగలు, సెనగల గురించి చెప్పుకోవచ్చు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి.

ప్రత్యామ్నాయాలు ఇవే!

సబ్జా విత్తనాలు, పుచ్చ విత్తనాలు కూడా పోషక భాండాగారాలే! వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలు, అలసందలు, బొబ్బర్లతో ఎక్కువ పీచు, ప్రొటీన్‌ దొరుకుతుంది. దోస గింజలు, నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్‌, పీచు ఉంటాయి. వీటితో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. కాబట్టి వేరుసెనగలు, నువ్వులను పొడి చేసుకుని కూరల్లో కలుపుకుంటూ ఉండాలి. చెక్కలు, ఉండలు తయారుచేసుకుని సాయంకాలం స్నాక్స్‌గా తింటూ ఉండాలి. ఎండుద్రాక్ష, ఇండియన్‌ డేట్స్‌లో పీచు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.


ఇలా తినొచ్చు

డ్రైఫ్రూట్స్‌ను తినే విషయంలో కొన్ని అనుమానాలుంటాయి. కొందరు వాటిని తినడానికి ఇష్టపడకపోవచ్చు. మరీ ముఖ్యంగా పిల్లలు వీటి పట్ల విముఖత ప్రదర్శిస్తారు. ఇలాంటి సందర్భాల్లో డ్రై ఫ్రూట్స్‌తో చిక్కీలు, లడ్లు తయారుచేసుకోవచ్చు. నాలుగు రకాల డ్రైఫ్రూట్స్‌ను నూనె లేకుండా వేయించి, పొడి కొట్టుకుని పాలలో కలుపుకుని తాగొచ్చు. బెల్లం పాకంలో కలిపి లడ్లు, చిక్కీలు తయారుచేసుకోవచ్చు. నువ్వులు, సబ్జా గింజలు, పనస, అవిసె గింజలు, వేరుసెనగలు, సెనగలను కూడా ఇదే విధంగా దంచి, బెల్లం పాకంలో కలిపి చిక్కీలు, లడ్లు తయారుచేసుకోవచ్చు. బెల్లంకు బదులుగా ఖర్జూరంతో కలిపి లడ్లు, చిక్కీలు తయారుచేసుకోవచ్చు. పాయసాలు, హల్వాల్లో డ్రైఫ్రూట్‌ పౌడర్‌ వాడుకోవచ్చు. తోటకూర గింజల్లో కూడా పోషకాలు ఎక్కువ. వీటితో కూడా చిక్కి తయారుచేసుకోవచ్చు.

నిస్సత్తువ వదిలేలా...

శక్తినిచ్చే డ్రైఫ్రూట్‌ స్నాక్స్‌ను సాయంకాలం వేళల్లో తినాలి. సాయంకాలానికి ఆఫీసు నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పెద్దలు, స్కూళ్ల నుంచి నీరసంగా ఇళ్లకు చేరుకునే పిల్లలకు ఇవి ఎనర్జీ బూస్టింగ్‌ స్నాక్స్‌గా ఉపయోగపడతాయి. వీటితో శక్తి పెరగడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో చక్కెర ఉండదు కాబట్టి మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే డ్రైఫ్రూట్స్‌ను హృద్రోగులు సైతం భయం లేకుండా తినొచ్చు. ప్రయాణాల్లో చటుక్కున తినగలిగే వీలుండే తిరుతిళ్లుగా వీటిని ఉపయోగించుకోవచ్చు.

డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, మలక్‌పేట్‌,

హైదరాబాద్‌

ఈ వార్తలు కూడా చదవండి...

మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన

ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 27 , 2026 | 05:15 AM