Share News

ప్రతి డిజైన్‌ వెనుక ఒక కన్నీటి కథ

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:53 AM

ఎవరి జీవితాల్లోనైనా మార్పు తేవాలని మీరు కోరుకుంటే... వాళ్లు తమ కాళ్ల మీద నిలబడడం ఎలాగో నేర్పించాలి... ఇది కుల్సుమ్‌ షాదాబ్‌ వహాద్‌ గట్టిగా నమ్మే సిద్ధాంతం. కర్ణాటకకు చెందిన...

ప్రతి డిజైన్‌ వెనుక ఒక కన్నీటి కథ

స్ఫూర్తి

ఎవరి జీవితాల్లోనైనా మార్పు తేవాలని మీరు కోరుకుంటే... వాళ్లు తమ కాళ్ల మీద నిలబడడం ఎలాగో నేర్పించాలి... ఇది కుల్సుమ్‌ షాదాబ్‌ వహాద్‌ గట్టిగా నమ్మే సిద్ధాంతం. కర్ణాటకకు చెందిన ఆమె యాసిడ్‌ దాడి బాధితుల ఉపాధి కోసం సరికొత్త ఫ్యాషన్‌ బ్రాండ్‌ను సృష్టించి, ‘మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో ప్రదర్శించారు. బాధితుల సృజనకు అంతర్జాతీయ గుర్తింపు పొందేలా చేశారు. వారికి ఆశావహమైన జీవితాలను అందించడంలో కుల్సుమ్‌ సాగిస్తున్న కృషి ఆమె మాటల్లోనే...

‘‘కిందటి ఏడాది సెప్టెంబర్‌లో... ఇటలీలో నిర్వహించిన ‘మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌’కు మా సంస్థ ‘అరా లూమియర్‌’ తరఫున నేను, మా బృందం హాజరయ్యాం. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్‌ బ్రాండ్లు అక్కడ ప్రదర్శితమయ్యాయి. అంతర్జాతీయ ఫ్యాషన్‌ దిగ్గజాలు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా సంస్థతో కలిసి పని చేస్తున్న యాసిడ్‌ బాధితుల కథలతో ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రదర్శిం చాం. అందులో వారి వేదన, జీవితాన్ని పునర్నిర్మించుకోవాలనే తపన, వారి ఆత్మవిశ్వాసం, సమాజంతో పోరాడిన తీరు... ఇవన్నీ ప్రతిఫలించాయి. చిత్రం పూర్తయిన తరువాత... వెలిగిన లైట్ల కాంతిలో... ఆహూతుల కళ్ళలో నీళ్ళు మెరుస్తున్నాయి. ‘‘ఈ ఫ్యాషన్‌ వీక్‌లో ఇది అత్యంత అద్భుతమైన సందర్భం. ఎందుకంటే ఇది వాస్తవికమైన, ఆశావహమైన క్షణం’’ అని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ఉంటే... భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఆరేళ్ళ నా ప్రయత్నం ఒక్కసారిగా నా కళ్ళముందు కదిలింది.


వాళ్ళు ఏ పాపం చేశారు?

మాది కర్ణాటకలోని బెంగళూరు. అక్కడ నా భర్త షాదాబ్‌ వహాబ్‌... ‘హోతూర్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. పేద వర్గాలవారికి విద్య, వైద్య సహాయం, పునరావాసం కల్పించడం దాని లక్ష్యం. నేను కూడా ఆ సంస్థలో కలిసి పని చేసేదాన్ని. అప్పుడే... కళల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర భావాల్ని పెంచాలని అనుకున్నాను. అందుకోసం ‘కలర్స్‌ ఆఫ్‌ హోప్‌’ సంస్థను ఏర్పాటు చేశాను. దాని ద్వారా వైకల్యాలు కలిగిన పిల్లల కోసం తరగతులు నిర్వహించేదాన్ని. ఒక రోజు ఒక ఆసుపత్రిలో పిల్లలకు ఆర్ట్‌ థెరపీ తరగతి నిర్వహించడానికి వెళ్ళాను. అక్కడ ఒక మహిళను చూశాను. ఆమె యాసిడ్‌ దాడి బాధితురాలు. ఆ స్థితిలో ఉన్న వారిని చూడడం నాకు అదే మొదటిసారి. యాసిడ్‌ దాడుల గురించి, బాధితులు పడే బాధ గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకున్నాను. ఒక మనిషి మీద వేరొకరు ఇంత కిరాతకంగా దాడి చేస్తారంటే నమ్మలేకపోయాను. కొందరు బాధితులను కలిసి మాట్లాడాను. ఎవరికీ ముఖం చూపించుకోలేక, బాధతో కుమిలిపోతున్న ఈ మహిళలు ఏ పాపం చేశారు? ఈ దారుణం చేసినవాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉంటే... వీళ్ళెందుకు సిగ్గుపడాలి? ఈ ప్రశ్నలు నాకు నిద్ర పట్టనివ్వలేదు. ‘వారికి కావల్సింది కేవలం చికిత్స కాదు... గుర్తింపు, ఆత్మగౌరవం, తమ జీవితాలను పునర్‌నిర్మించుకొనే అవకాశం’ అని గ్రహించాను.


33-Navya.jpg

ఎన్నడూ ఊహించలేదు

మొదట్లో వారికి ఆర్థిక సహాయాన్ని అందించేదాన్ని. అది మాత్రమే చాలదని అర్థమయింది. ఎందుకంటే... మద్యానికి అలవాటు పడిన వారి భర్తలు ఆ డబ్బును బలవంతంగా లాక్కోవడం, దొంగిలించడం చేస్తున్నారు. ఈ మహిళలు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. వారి బతుకుల్లో మార్పు తీసుకురావాలంటే... వాళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడాలి. అందుకోసం ఏం చేయాలనుకుంటున్నారని ఆ మహిళలనే అడిగాను. వారి కోరిక మేరకు... కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్‌ తదితర అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాను. మరోవైపు వర్క్‌ షాప్‌లు నిర్వహించి... సమాజాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాను. వారు తయారు చేసిన వాటిని విక్రయించడం ద్వారా ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి దోహదం చేశాను. ఈ నేపథ్యంలో ఒక రోజు కొందరు మహిళలు మా వర్క్‌షా్‌పకు వచ్చారు. దుస్తులు కుట్టాక... వ్యర్థంగా మిగిలిన వస్త్రపు ముక్కలతో తయారు చేసిన బ్యాగ్‌లు వారిని ఆకర్షించాయి. వారిలో ఒక ఇటాలియన్‌ మహిళ... మమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటూ... ‘మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌’కు ఆహ్వానించారు. అక్కడ ఏర్పాట్లు తను చూస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటిది అవకాశాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించడం కోసం మాకు ఒక బ్రాండ్‌ కావాలి. అలా... ‘అరా లూమియర్‌’ అనే లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించాను.


వారికిది పునర్జన్మ

వాస్తవానికి ఈ బ్రాండ్‌ సృష్టికర్తలు... యాసిడ్‌ దాడుల బాధితులు. వారు రూపొందించే ప్రతి డిజైన్‌ వెనుక, ప్రతి ఎంబ్రాయిడరీ వెనుక, ప్రతి కుట్టు వెనుక ఒక వేదన ఉంది, ఒక ఆశ ఉంది. ఇది కేవలం ఫ్యాషన్‌ కాదు... పునర్జన్మ. భగ్నమైన వారి జీవితాలను పునర్నిర్మించుకొనే ఒక ప్రయత్నం. క్రమంగా మా బ్రాండ్‌ మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు సంపాదించుకుంది. వివిధ దేశాల్లోని దుకాణాలతోపాటు మా వెబ్‌సైట్‌ ద్వారా విక్రయాలు సాగిస్తున్నాం. ‘మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో మాకు దక్కిన అభినందనలు... గొప్ప భవిష్యత్తుకు చిహ్నాలుగా భావిస్తున్నాం.. ఇప్పుడు ‘అరా లూమియర్‌’లో 123 మంది మహిళలు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. అందరికీ కుట్టు మిషన్లు సమకూర్చి, ఇల్లు కదలకుండా పని చేసే అవకాశం కల్పిస్తున్నాను. అలాగే మరికొందరు మహిళలకు ఉపాధి కల్పించడం కోసం బ్లాక్‌ ప్రింటింగ్‌ యూనిట్‌ను ఈ మధ్యే ప్రారంభించాను. నా భర్త నడుపుతున్న ‘హోతూర్‌ ఫౌండేషన్‌’ ద్వారా యాసిడ్‌ బాధిత మహిళలకు వైద్యం, శస్త్ర చికిత్సలు, న్యాయ సహాయం లాంటివాటితో పాటు వారికి, వారి పిల్లలకు విద్యను అందిస్తున్నాం. యాసిడ్‌ దాడుల్లో కుంగిపోయిన మహిళలు తమ జీవితాలను కొత్తగా నిర్వచించుకోవడానికి దోహదపడాలనేదే నా ఆశయం.’’

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:53 AM