కొత్త యూట్యూబర్లకు షాక్!
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:38 AM
యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ షాకిచ్చింది. మానిటైజేషన్ కోసం అర్హత పొందేందుకు ఇకపై రెట్టింపు వ్యూస్ సాధించాలనే...
మానిటైజేషన్ కోసం ఇక రెట్టింపు వ్యూస్
తప్పనిసరి.. 2027 ఫిబ్రవరి నుంచి అమలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11: యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ షాకిచ్చింది. మానిటైజేషన్ కోసం అర్హత పొందేందుకు ఇకపై రెట్టింపు వ్యూస్ సాధించాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. కొత్తగా కంటెంట్ క్రియేటర్లుగా చేరేవారు ఏడాది వ్యవధిలో కనీసం 8వేల గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధిస్తేనే మానిటైజేషన్‌కు అర్హత పొందుతారు. ప్రస్తుతం ఇది ఏడాది వ్యవధిలో 4వేల గంటల వాచ్‌టైమ్ లేదా 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్‌గా ఉంది. అయితే ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లకు కొత్త నిబంధన వర్తించదని సంస్థ పేర్కొంది. కొత్తగా వైపీపీలో చేరేవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ప్లాట్‌ఫామ్‌పై పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. వెయ్యి మంది సబ్‌స్క్రయిబర్లు ఉండాలనే నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. యూట్యూబ్‌లో వినియోగం, కంటెంట్ పరిమాణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై రోజూ 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్ నమోదవుతున్నాయని, టీవీల్లో ప్రతిరోజూ 100 కోట్ల గంటలకు పైగా వాచ్‌టైమ్ నమోదవుతోందని వివరించింది. ఇక తమ ‘ప్రీమియం లైట్’ సబ్ స్ర్కిప్షన్ సేవలను మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్