ఏఐ సదస్సులో నిరసనకారులపై కొరడా.. పోలీసుల గాలింపు
ABN , Publish Date - Feb 20 , 2026 | 09:16 PM
భారత్ మండపంలోని 15 వీడియో క్లిప్‌ల ఆధారంగా నిరసనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఇంటరాగేషన్‌లో కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అయితే పలువురి ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝళిపించారు. ప్రధానమంత్రి మోదీకి, అమెకాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసనలకు దిగిన కార్యకర్తలు అక్కడి నుంచి హడావిడిగా నిష్క్రమించారు. వేదక వద్దే నలుగురిని నిర్బంధంలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారిని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తక్కిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
భారత్ మండపంలోని 15 వీడియో క్లిప్‌ల ఆధారంగా నిరసనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఇంటరాగేషన్‌లో కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అయితే పలువురి ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. నిరసనకారులు (యువజన కాంగ్రెస్ కార్యకర్తలు) భారత్ మండపానికి ఎలా చేరుకున్నారు? అంతకుముందు ఎక్కడున్నారు? ఎప్పుడు ఢిల్లీ వచ్చారు? వాహనాల్లో వచ్చారా? ఆ వాహనాలు ఎవరివి? సమ్మిట్‌లో గొడవకు దిగే ముందు మొబైల్ ఫోన్స్‌లో ఎవరితో మాట్లాడారు? వాళ్లు ధరించిన టీ-షర్టులు ఢిల్లీలో ప్రింటయ్యాయా? బయట ప్రింటయ్యాయా? టీ-షర్టుల ప్రింటింగ్‌కు డబ్బులు ఎవరు చెల్లించారు? నలుపు గొడుగుతో మండపంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసిందెవరు? ఈ అల్లర్లు వారి సొంత ప్లానా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల నుంచి పోలీసులు విచారణ ప్రారంభించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. నేరపూరిత కుట్ర, పబ్లిక్ సర్వెంట్‌లను గాయపరచడం, దాడి, చట్ట ఉల్లంఘన, చట్టవిరుద్ధంగా గుమిగూడటం వంటి అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, నిరసనకారులు తొలుత ప్రింటెడ్ సిక్టర్లున్న నలుపు గొడుగులతో మండపంలోకి అడుగుపట్టాలని ప్లాన్ చేశారని, సెక్యూరిటీ తనిఖీల్లో పట్టుబడే అవకాశాలున్నాయనే కారణంగా వ్యూహం మార్చుకుని ప్రింటెండ్ మెసేజ్‌లు ఉన్న టీ-షర్టులు ధరించాలని నిర్ణయించారని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
జోడోలో రాహుల్‌తో ఉన్న వ్యక్తి పనే ఇది.. పాత ఫోటో విడుదల చేసిన బీజేపీ
అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక