యమునలో పడవ బోల్తా.. 10 మంది మృతి
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:25 AM
ఉత్తరప్రదేశ్‌లోని మఽథుర జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం బృందావన్‌లోని యమునా నదిలో భక్తులతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా...
యూపీలోని బృందావన్‌లో ఘటన
మధుర, ఏప్రిల్ 10: ఉత్తరప్రదేశ్‌లోని మఽథుర జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం బృందావన్‌లోని యమునా నదిలో భక్తులతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారు. వీరంతా పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వారిగా జిల్లా అధికారులు గుర్తించారు. సుమారు 30 మంది భక్తులు రెండు పడవల్లో ప్రయాణిస్తుండగా, కేసీ ఘాట్ సమీపంలో ఒక పడవ ప్రమాదానికి గురైందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పడవ అదుపు తప్పి వేగంగా వెళ్తూ అక్కడే ఉన్న తేలియాడే వంతెనను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి పడవ ఒక్కసారిగా తలకిందులు కావడంతో అందులోని ప్రయాణికులంతా నీటిలో మునిగిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో సుమారు 15 నుంచి 17 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు సమారు 50 మంది ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్