మళ్లీ వర్క్ ఫ్రం హోం దిశగా ఐటీ?
ABN , Publish Date - May 12 , 2026 | 05:52 AM
చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు ‘వర్క్ ఫ్రం హోం’ను ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఐటీ రంగంలో ఆ మేరకు కదలిక మొదలైంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని...
గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలు అప్రమత్తం
ప్రధాని సూచనతో మొదలైన చర్చ
న్యూఢిల్లీ, మే 11: చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు ‘వర్క్ ఫ్రం హోం’ను ఎంచుకోవాలని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో ఐటీ రంగంలో ఆ మేరకు కదలిక మొదలైంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఉద్యోగుల రాకపోకలను నియంత్రించడం లక్ష్యంగా ఐటీ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానాలను విస్త్రృతం చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరంతరం మారుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కంపెనీలు ఇప్పటికే క్యాంప్‌సలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయని పేర్కొంది. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సౌకర్యాలను పరిమితం చేశామని తెలిపింది. రిమోట్ లేదా హైబ్రిడ్ విధానాలతో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాలను తగ్గించి, తద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తామని ప్రకటించింది. హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై, గురుగ్రామ్ లాంటి ఐటీ హబ్‌లలో లక్షల మంది ఉద్యోగులు రోజూ వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తుండటంతో భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతోంది. ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని, మెట్రో సేవలను వినియోగించాలని, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించారు. కొవిడ్ సమయంలో అలవాటు పడిన వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లను మళ్లీ విస్తృతంగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
మూడేళ్లు వర్క్ ఫ్రం హోం
2020లో కొవిడ్ సమస్య వచ్చినపుడు మొత్తం ఐటీ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారింది. తర్వాత మూడేళ్లపాటు హైబ్రిడ్ విధానమే కొనసాగింది. గత ఏడాది నుంచే కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఒత్తిడి చేస్తున్నాయి. తాజాగా గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో రవాణా వ్యయాలు పెరుగుతున్న తరుణంలో కంపెనీలు మరోమారు వర్క్ ఫ్రం హోం వైపు మొగ్గు చూపుతున్నాయి. భారీ క్యాంప్‌సలు నిర్వహించే కంపెనీలు విద్యుత్, డీజిల్ జనరేటర్ వినియోగం, ఉద్యోగుల ట్రాన్ప్‌పోర్టు ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు దశలవారీగా పెంచేందుకు సిద్ధమైన నేపథ్యంలో కంపెనీలకు రవాణా చార్జీలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం దిశగా కంపెనీలు కదలడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఎక్కువ కంపెనీలు వర్క్ ఫ్రం హోం కాకుండా హైబ్రిడ్ పద్ధతికే ఓటేసే అవకాశం ఉందని చెబుతున్నారు. హోర్మూజ్ సంక్షోభం ముదిరితే నిర్ణయం ఐటీ కంపెనీలకు వదిలేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వమే వర్క్ ఫ్రం హోంను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
తప్పనిసరి చేయండి
అవకాశం ఉన్న ప్రతీ చోట వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రం అధికారిక సలహా జారీ చేయాలని ఉద్యోగ సంఘం కోరింది. ఎన్‌ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్పీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, రోజూ లక్షల మంది ఐటీ ఉద్యోగుల ప్రయాణాలు తగ్గితే దేశానికి భారీ స్థాయిలో ఇంధన పొదుపు సాధ్యం అవుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్