Share News

విపక్ష విజయం

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:22 AM

విపక్షాలే విజయం సాధించాయి. మోదీ సర్కారు ఓడిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా..

విపక్ష విజయం

  • 2/3 మెజారిటీ లేక వీగిన మహిళా బిల్లు డీలిమిటేషన్‌ బిల్లు వెనక్కి

  • ఓటింగ్‌లోపాల్గొన్న 528 మంది సభ్యులు.. అనుకూలంగా 298.. వ్యతిరేకంగా 230 ఓట్లు

  • 12 ఏళ్ల మోదీ పాలనలో రాజ్యాంగ సవరణ బిల్లును సభ తిరస్కరించడం ఇదే మొదటిసారి

  • ఓటింగ్‌ షెడ్యూల్‌ సమయానికి కూడా బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపు అంశాన్ని చేర్చని ప్రభుత్వం

  • ఆమోదిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని చివరి గంటలో చెప్పిన అమిత్‌షా

  • మహిళను ప్రధాని చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చినా బీజేపీని నమ్మే ప్రసక్తే లేదన్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌

  • విపక్షాలు ఒప్పుకోకపోవడంతో ఒరిజినల్‌ బిల్లుతో ఓటింగ్‌

  • మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేయండి. దేశ నారీశక్తి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించకండి. మీ ఇంట్లోని అమ్మ, సోదరి, కూతురు, భార్యను దృష్టిలో ఉంచుకొని మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి.

- లోక్‌సభ సభ్యులకు ఎక్స్‌లో మోదీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): విపక్షాలే విజయం సాధించాయి. మోదీ సర్కారు ఓడిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ కల్పించేందుకు, 2011 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్లను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు 68 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఈ బిల్లులను ఆమోదించే విషయంలో ప్రతిపక్షాలను ఒప్పించేందుకు చివరి వరకూ మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో మూడింట రెండువంతుల మెజారిటీ రావాలంటే 352 ఓట్లు అవసరం కాగా.. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావడంతో బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. దీనితో రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. శనివారం నాడు ఉభయ సభాధిపతుల ముగింపు వాక్యాలు, వందేమాతరంతో పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడనుంది. కేంద్రంలో 12 సంవత్సరాల మోదీ పాలనలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లును సభ తిరస్కరించడం ఇదే మొదటి సారి. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం ఏ మాత్రం తగ్గకుండా.. అన్ని రాష్ట్రాలకూ 50 శాతం మేర సీట్లను పెంచుతామంటూ గురువారం సభ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం బిల్లులో మాత్రం ఆ విషయాన్ని పేర్కొనలేదు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ సీట్లను పెంచుతామనే బిల్లులో పేర్కొంది. బిల్లులపై గురువారం మొదలైన చర్చ శుక్రవారం కూడా కొనసాగింది.


బిల్లుకు వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఎ.రాజా, అకాలీదళ్‌ ఎంపీ హరిసిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్‌, తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ, కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఇక బిల్లుకు అనుకూలంగా టీడీపీ ఎంపీ కలిశె ట్టి అప్పలనాయుడు, బీజేపీ ఎంపీలు నిశికాంత్‌దుబే, ప్రతాప్‌ సారంగి, డీకే అరుణ, వైసీపీ ఎంపీలు మిథున్‌ రెడ్డి, గుమ్మా తనూజా రాణి, జేడీయూ ఎంపీ లలన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు కుమార స్వామి, అనుప్రియ పాటిల్‌, అన్నపూర్ణాదేవి తదితరులు ప్రసంగించారు. షెడ్యూలు ప్రకారం బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సభలో ఓటింగ్‌ జరగాల్సి ఉండగా.. దాన్ని వాయిదా వేశారు. ఆరు గంటలకు బిల్లులపై అమిత్‌ షా సమాధానం ఇస్తారని, ఆయన ప్రసంగం తర్వాత ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఆమోదిస్తామంటే బిల్లును గంటలో సవరించి.. అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు అధికంగా లభిస్తాయన్న వాక్యాన్ని చేరుస్తానని అప్పుడు చెప్పారు. ‘‘మహిళా కోటా/నారీశక్తి వందన్‌ అధినియమ్‌.. 2029లో అమలు కావాలంటే.. నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. 50 శాతం సీట్ల పెంపుతో.. సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 23.76 శాతం నుంచి 23.87 శాతానికి పెరుగుతుంది. ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణం 50 శాతం సీట్ల పెంపు అంశం లేకపోవడమే అయితే.. సభాకార్యకలాపాలను ఒక్క గంటసేపు నిలిపివేయండి. దీనికి అధికారిక సవరణ తీసుకొస్తా. కానీ, వారు (ప్రతిపక్షం) ఈ బిల్లును ఆమోదిస్తామని మొదట హామీ ఇవ్వాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కానీ, అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అన్నాయి. ‘‘దాదాపు 11 సంవత్సరాల మా అనుభవాన్ని బట్టి.. మహిళను ప్రధాని చేస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇచ్చినా సరే, భారతీయ జనతాపార్టీని మేం నమ్మే ప్రసక్తే లేదు’’ అని సమాజ్‌ వాది పార్టీ ఎంపి అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

బిల్లు ఓటమి అనంతరం ఎన్డీఏ ఫ్లోర్‌ లీడర్ల భేటీ

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి అనంతరం ఎన్డీయేకు చెందిన ఫ్లోర్‌ లీడర్లు పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో భేటీ అయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జె.పి.నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్‌, అర్జున్‌ రాం మేఘ్వాల్‌లు హాజరు కాగా, మిత్రపక్షాల తరఫున కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు (తెలుగుదేశం), జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్‌పీ), రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ (జేడీ-యూ), చిరాగ్‌ పాసవాన్‌ (ఆర్‌ఎల్‌పీ-ఆర్‌వీ) పాల్గొన్నారు. ఇది సాధారణ సమన్వయ సమావేశమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

3.jpg

Updated Date - Apr 18 , 2026 | 06:49 AM