Share News

కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తీసేసిన డాక్టర్.. భారీ షాక్ ఇచ్చిన కన్సూమర్ కోర్టు..

ABN , Publish Date - May 21 , 2026 | 06:03 PM

ఒక కిడ్నీకి బదువు ఇంకో కిడ్నీ తిసి ఓ మహిళ చావుకు కారణమైన డాక్టర్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తీసేసిన డాక్టర్.. భారీ షాక్ ఇచ్చిన కన్సూమర్ కోర్టు..
medical negligence case

ఇంటర్‌నెట్ డెస్క్: ఒక కిడ్నీకి బదువు ఇంకో కిడ్నీ తిసి ఓ మహిళ చావుకు కారణమైన డాక్టర్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. మృతురాలి కుటుంబసభ్యులు వేసిన కేసుపై రిటైర్డ్ జస్టిస్ ఏపీ సాహి, భరత్‌కుమార్ పాండ్యాలతో కూడిన ధర్మాసనం మే 18న విచారణ జరిపింది.


‘తల్లిని ఆమె కుమారులకు.. భార్యను ఆమె భర్తకు.. గృహిణిని ఆమె కుటుంబానికి దూరం చేయడం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. నిర్లక్ష్యానికి గానూ డాక్టర్ భారీ నష్టపరిహారం చెల్లించాల్సిందే’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 1.5 కోట్ల రూపాయలు.. నలుగురు ఫిర్యాదుదారులకు ఒక్కోరికి 10 లక్షల చొప్పున 40 లక్షల రూపాయలు.. కోర్టు ఖర్చుల నిమిత్తం లక్షరూపాయలు ఇవ్వాలని డాక్టర్‌ను ఆదేశించింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన ఓ మహిళ 2012 ఏప్రిల్ 17వ తేదీన కడుపు నొప్పితో స్థానికంగా ఉండే ఓ నర్సింగ్ హోమ్‌లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కుడి కిడ్నీలో సమస్యను గుర్తించారు. ఆ కిడ్నీని తీసివేయాలని బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు చెప్పారు. మే 6వ తేదీన కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఆమెను డయాలసిస్‌కు పంపించారు. రోజులు గడుస్తున్నా.. డయాలసిస్ చేయించుకుంటున్నా కడుపునొప్పి సమస్య ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆమె వేరే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి సమస్య ఉన్న కుడి కిడ్నీ అలాగే ఉందని గుర్తించారు.


ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కుడి కిడ్నీకి బదులు ఆరోగ్యంగా ఉన్న ఎడమ కిడ్నీని తీసేశారని కనుగొన్నారు. బాధితురాలు దీనిపై పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిపై కేసు పెట్టింది. కిడ్నీ సమస్య కారణంగా రెండేళ్ల తర్వాత 2014లో మరణించింది. ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబసభ్యులు కన్సూమర్ కోర్టును ఆశ్రయించారు. తమకు 2 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరారు. తాజాగా, తుది విచారణ జరిపిన కన్సూమర్ కోర్టు మృతురాలి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని సర్జరీ చేసిన డాక్టర్‌ను ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ

ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా

Updated Date - May 21 , 2026 | 06:10 PM