Share News

ప్రభుత్వం ఎందుకు దిగి రావాల్సి వచ్చింది?

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:43 AM

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్‌కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‘‘మేం ఎన్డీయే. యూపీఏ కాదు....

ప్రభుత్వం ఎందుకు దిగి రావాల్సి వచ్చింది?

నీట్‌ వ్యవస్థాగత లోపాలను బట్టబయలు చేసిన జెన్‌జీ.. విద్యార్థుల మరణాలతో బలపడ్డ రాజీనామా డిమాండ్‌

  • 20న పోలీసుల లాఠీచార్జితో దేశమంతా విస్తరించిన ఉద్యమం

  • ఒత్తిడి పెంచిన జోషి, అన్నా హజారే, మోహన్‌ భాగవత్‌ ప్రకటనలు

  • త్వరలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ, జూలై 25: మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్‌కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‘‘మేం ఎన్డీయే. యూపీఏ కాదు. మా మంత్రులు రాజీనామా చేయరు’’ అన్నారు. ఆ తర్వాత 2018లో ఎంజే అక్బర్‌ రాజీనామా చేసినప్పటికీ అది ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది. ఆయన రాజీనామా తథ్యమని అందరికీ తెలుసు. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా మాత్రం ఒక్క రోజులో జరిగింది కాదు. మే 3 నుంచి జూలై 25 వరకు 84 రోజుల వ్యవధిలో ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం, ఉదృతంగా సాగిన ఉద్యమం, ప్రభుత్వ వ్యూహం, అధికార పార్టీలో సందిగ్దం అన్నీ కలిసి ఈ ముగింపు తీసుకొచ్చాయి. మొదట నీట్‌ ప్రశ్న పత్రం లీక్‌ అయింది. దీంతో పరీక్షను రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ మొదలైంది. ఈ వ్యవహారంలో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. వివాదం సద్దుమణుగుతోంది అనుకునేలోపు సీబీఎ్‌సఈ ఫలితాలు వచ్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానంలో మసక స్కానింగ్‌, మాయమైన పేజీలు, తారుమారైన జవాబు పత్రాలు.. వెరసి పేపర్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం బయపటడింది. మరోవైపు, నీట్‌ పరీక్ష రద్దుకూ జూన్‌ 21న తిరిగి పరీక్ష జరగడానికి మధ్య 37 రోజుల విరామం ఉంది. ఈ మధ్యలో దేశవ్యాప్తంగా చాలామంది నీట్‌ అభ్యర్థులు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, పరీక్ష సంస్కరణల నుంచి జవాబుదారీతనం వైపు డిమాండ్‌ మళ్లింది. మంత్రి రాజీనామా నినాదంగా మారింది. ఈ నినాదంతోనే సీజేపీ ఉద్యమం జూన్‌ 6న జంతర్‌ మంతర్‌ ధర్నాతో ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఇక్కడే సీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రతిపక్ష పార్టీలను దూరంగా పెట్టలేదు. వాటితో అనుబంధం పెంచుకోలేదు. దీంతో సీజేపీ నిరసనలు ప్రతిపక్షాల కుట్ర అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు. పన్నెండేళ్ల క్రితం సామాజిక మాధ్యమాలనే ఆదరువుగా చేసుకొని అధికారానికి వచ్చిన బీజేపీకి ఈసారి సీజేపీ సోషల్‌ మీడియా దాడిని ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. జూన్‌ 28న సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించడంతో ఉద్యమానికి నైతిక కేంద్రం లభించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.


20నే ప్రభుత్వం చేతుల్లోంచి జారిపోయింది

జూలై 20పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజు. ఉద్యమకారులు సంసద్‌ చలో కార్యక్రమాన్ని ప్రకటించారు. దీనికి దేశయువత నుంచి అనూహ్య మద్దతు లభించింది. లక్షలాది మంది ఢిల్లీకి తరలివచ్చారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్యమం తీవ్రమైంది. వాజ్‌పేయి హయాంలో విద్యామంత్రిగా ఉన్న దిగ్గజనేత మురళీ మనోహర్‌ జోషి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీతో మంచి సంబంధాలున్న సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కూడా విద్యార్థులకు మద్దతు పలకడంతో బీజేపీ ఇరుకున పడింది. ఇంకోవైపు యూపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైగాచివరికి బీజేపీకి దిశానిర్దేశం చేసే మోహన్‌ భాగవత్‌ కూడా కొత్తతరం ప్రశ్నిస్తోందని, దానికి ఆజ్ఞాపిస్తే కుదరదని తేల్చిచెప్పారు. దీంతో, కేంద్రప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది.

ఈ వార్తలనూ చదవండి:

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

Updated Date - Jul 26 , 2026 | 05:43 AM