కేంద్రం నోటీసులు.. ఎక్స్ వేదికగా స్పందించిన వాట్సాప్..
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:19 AM
వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో ప్రవేశపెట్టబోతున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో మెటా సంస్థకు చెందిన వాట్సాప్ కీలక వివరణ ఇచ్చింది. ప్రస్తుతం యూజర్‌నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదని, వినియోగదారులు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని స్పష్టం చేసింది. ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివర్లో దశలవారీగా అమలు చేస్తామని వెల్లడించింది. యూజర్‌నేమ్ ఫీచర్‌తో వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను వెల్లడించకుండా కొత్త వ్యక్తులు, గ్రూపులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్‌తో గోప్యత, భద్రత, నకిలీ ఖాతాలు, మోసాలు వంటి అంశాలపై వస్తున్న సందేహాలకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది.
యూజర్‌నేమ్ తప్పనిసరి కాదు..
యూజర్‌నేమ్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సృష్టించాల్సిన అవసరం లేదని వాట్సాప్ తెలిపింది. ఇది పూర్తిగా వారి ఇష్టమని పేర్కొంది.
కొన్ని యూజర్‌నేమ్‌లు ఎందుకు అందుబాటులో ఉండవు?
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఉన్న యూజర్‌నేమ్‌లు ఆయా ఖాతాదారుల కోసం రిజర్వ్ చేయబడతాయని వాట్సాప్ తెలిపింది. అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన పేర్లు, వాటి వేరియేషన్లు కూడా దుర్వినియోగానికి గురి కాకుండా రక్షిస్తామని పేర్కొంది. ఒకవేళ సాధారణ పేరు ఇప్పటికే మరొకరు తీసుకున్నట్లయితే, ప్రత్యామ్నాయ యూజర్‌నేమ్‌లను సూచించే జనరేటర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
నకిలీ ఖాతాలపై ప్రత్యేక చర్యలు
తన యూజర్‌నేమ్‌కు దగ్గరగా మరో వ్యక్తి పేరు సృష్టించి మోసాలకు పాల్పడితే ఎలా అనే ప్రశ్నకు వాట్సాప్ స్పందించింది. యూజర్‌నేమ్‌లను సెర్చ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. యూజర్‌నేమ్ ఆధారంగా సందేశాలు పంపే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, కొత్త వ్యక్తి నుంచి మెసేజ్ వస్తే అతని దేశం, ఖాతా వివరాలు, భద్రతా హెచ్చరికలు చూపిస్తామని తెలిపింది. ఇప్పటికే ఉన్న బ్లాక్, రిపోర్ట్ వంటి భద్రతా చర్యలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.
యూజర్‌నేమ్ కీతో అదనపు భద్రత
యూజర్‌నేమ్‌తో పాటు 'యూజర్‌నేమ్ కీ' అనే అదనపు భద్రతా వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే, అవతలి వ్యక్తికి యూజర్‌నేమ్‌తో పాటు కీ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌లకు లింక్..
ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న అదే యూజర్‌నేమ్‌ను వాట్సాప్‌లో కూడా ఉపయోగించాలనుకునే వారు ముందుగా ఆ ఖాతాలను లింక్ చేసి యాజమాన్యాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అనంతరం కావాలంటే ఆ ఖాతాలను అన్‌లింక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది.
కేంద్రం నోటీసు
యూజర్‌నేమ్ ఫీచర్ అమలుతో నకిలీ గుర్తింపులు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆర్థిక మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు, ఆర్థిక సంస్థలు, ప్రజాప్రతినిధుల పేర్లతో పోలిన యూజర్‌నేమ్‌లను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంటూ ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌ను అమలు చేయొద్దని వాట్సాప్‌ను ఆదేశించింది. అలాగే ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, భద్రతా చర్యలపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని నోటీసు జారీ చేసింది.
దీనిపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి ప్రస్తుతం యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించామని, యూజర్‌నేమ్ ఆధారంగా మెసేజింగ్ సేవ ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీలు, మెటా వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన యూజర్‌నేమ్‌లను వారి అసలు యజమానుల కోసమే రిజర్వ్ చేసినట్లు తెలిపారు. అలాగే యూజర్‌నేమ్‌ను కచ్చితంగా తెలుసుకోవాల్సిన విధానం, యూజర్‌నేమ్ కీ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, మోసాల నివారణ వంటి పలు భద్రతా చర్యలను అమలు చేస్తున్నట్లు వివరించారు. వాట్సాప్‌ను ఉపయోగించడానికి మొబైల్ నంబర్ తప్పనిసరిగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లేందుకు యత్నం.. 20 మంది మహిళల అరెస్ట్
వయ్యారాల కారిడార్.. జీవీకే1 నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు..