Share News

డీఆర్‌డీఓ మరో అద్భుతం! ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికత ఏంటంటే..

ABN , Publish Date - Feb 03 , 2026 | 09:54 PM

డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిన ఎస్ఎఫ్‌డీఆర్ సాంకేతికత భారత్ రక్షణ రంగంలో కీలక మైలురాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ టెక్నాలజీ విశేషాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

డీఆర్‌డీఓ మరో అద్భుతం! ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికత ఏంటంటే..
DRDO SFDR Technology

ఇంటర్నెట్ డెస్క్: భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ - DRDO) మంగళవారం నిర్వహించిన సాలిడ్ ఫ్యూయెల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డీఆర్) పరీక్ష విజయవంతమైంది. భారత రక్షణ రంగ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. ఒడిశాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో ఎస్‌ఎఫ్‌డీఆర్‌ సాంకేతికత (SFDR Technology) సక్రమంగా పనిచేసిందని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి మిసైల్స్‌ను రూపొందించేందుకు ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం కీలకమని పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరింది.


ఏమిటీ ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికత

సంప్రదాయక మిసైల్స్‌లో ఇంధనంతో పాటు దాన్ని మండించేందుకు అవసరమైన ఆక్సిడైజర్‌నూ నింపుతారు. దీంతో, వాటి బరువు పెరిగి రేంజ్ తగ్గుతుంది. అయితే, ఎస్‌ఎఫ్‌డీఆర్‌ సాంకేతికతతో గాల్లోని ఆక్సిజన్‌ను ఉపయోగించి ఇంధనాన్ని మండించొచ్చు. ఫలితంగా, ఆక్సిడైజర్ అవసరం చాలా వరకూ తగ్గిపోతుంది. మిసైల్‌లో మరింత ఇంధనాన్ని నింపే అవకాశం చిక్కుతుంది. దీంతో మిసైల్ మరింత ఎక్కువ దూరం ప్రయాణించి లక్ష్యాలను ఛేదిస్తుంది.

సంప్రదాయక మిసైల్స్‌లో చివరి దశలో ఇంధనం అయిపోతుంది. కానీ ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికతతో తుదవరకూ శక్తి లభించి మిసైల్ మరింత ప్రభావశీలంగా లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది.

ఎస్‌ఎఫ్‌డీఆర్ మిసైల్‌ను చివరి దశల్లో కూడా ప్రయాణదిశను మార్చే అవకాశం ఉండటంతో శత్రుదేశ లక్ష్యాలను ఇది మరింత సమర్థవంతంగా ఛేదించగలుగుతుంది. శత్రుదేశ విమానాలు మిసైల్ నుంచి తప్పించుకునే అవకాశం తగ్గిపోతుంది.


ఈ మిసైల్స్‌లోని ఫ్యూయెల్ ఫ్లో కంట్రోలర్ కారణంగా వేగాన్ని అవసరాల మేరకు నియంత్రించి మరింత సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా, రష్యాతో పాటు కొన్ని ఐరోపా దేశాల వద్ద ఈ సాంకేతికత ఉంది. ఈ టెక్నాలజీని ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అస్త్రా మార్క్-3 మిసైల్స్‌లో కూడా వినియోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

పారిశుద్ధ్య కార్మికురాలికి సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్ గిఫ్ట్..

అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్చిన ఐఏఎస్.. నెట్టింట అభ్యంతరాలు

Updated Date - Feb 03 , 2026 | 10:13 PM