Share News

అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్చిన ఐఏఎస్.. నెట్టింట అభ్యంతరాలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 07:09 PM

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన కూతురిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన నెట్టింట పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అంగన్వాడీ కేంద్రంలో 3 ఏళ్ల కూతురిని చేర్చిన ఐఏఎస్.. నెట్టింట అభ్యంతరాలు
Pulkit Garg IAS

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ పులకిత్ గార్గ్ (IAS Pulkit Garg) తన మూడేళ్ల కూతురిని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చిత్రకూట్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో ఆయన తన కూతురిని చేర్పించారు.

తన నిర్ణయం సబబేనని కూడా గార్గ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన జిల్లా మెజిస్ట్రేట్‌గా ఉన్నారు. గత కొన్నేళ్లల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎంతో మెరుగుపడిందని అన్నారు. ‘పరిస్థితులు ఒకప్పటిలా ప్రస్తుతం లేవు. విద్యలో నాణ్యత ఎంతో పెరిగింది. ఎన్నో వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన బిడ్డను ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తే సాధారణ ప్రజలు కూడా తమ పిల్లల్ని ఎలాంటి సంకోచం లేకుండా ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తారు’ అని ఆయన చెప్పుకొచ్చారు (Pulkit Garg Daughter Enrol in Anganwadi Center).

ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలికవసతులపై ప్రజాభిప్రాయం మారిందని కూడా ఆయన చెప్పారు. పిల్లల బాల్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని పులకిత్ గార్గ్ అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం పోషకాహారం అందించడంతోపాటు వారికి విలువలనూ బోధించాలని అన్నారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అంగన్వాడీ సెంటర్లలో అన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లపై ఉన్న దురభిప్రాయాలను తొలగించుకుని స్థానికులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఆయన తన కూతురి వీడియోను కూడా షేర్ చేశారు (Viral Video).


అయితే, ఈ వీడియోపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఐఏఎస్ అధికారి నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు సరిగా ఉండవని, ఇతర లోపాలు ఎన్నో ఉంటాయని హెచ్చరించారు. ఆయన నిర్ణయాన్ని సమర్థించిన కొందరు అక్కడి ఫుడ్‌ను కూతురికి ఇవ్వొద్దని సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవీ చదవండి:

ప్రాణాలతో చెలగాటం వద్దు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

Updated Date - Feb 03 , 2026 | 07:55 PM