నిరసనల్లో ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు..
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:37 PM
నిరసనలు, అల్లర్ల సమయంలో ప్రభుత్వ లేదా పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ సిద్ధమైంది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజా శాంతిభద్రతల నిర్వహణ (సవరణ) చట్టం, 2026’ను అమల్లోకి తెచ్చింది.
కోల్‌కతా, ఆగస్టు 26: నిరసనలు, అల్లర్ల సమయంలో ప్రభుత్వ లేదా పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ సిద్ధమైంది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజా శాంతిభద్రతల నిర్వహణ (సవరణ) చట్టం, 2026’ను అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రభుత్వ లేదా పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి హెచ్చరించారు.
సమాజంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికే ఈ 'యాంటీ-గూండా చట్టం'లోని భాగాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘పశ్చిమ బెంగాల్ ప్రజా శాంతిభద్రతల నిర్వహణ (సవరణ) చట్టం, 2026’ ప్రకారం.. నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే, జరిగిన నష్టానికి మూడు రెట్లు పరిహారంతో పాటు వడ్డీని కూడా వసూలు చేస్తారు. ఒకవేళ నిందితులు నష్టపరిహారాన్ని చెల్లించకపోతే.. వారి ఆస్తులను జప్తు చేసి (అటాచ్‌మెంట్) వేలం వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
నష్టాన్ని అంచనా వేయడానికి.. అల్లరిమూకలు, నిరసనకారులు, వారిని ఉసిగొల్పిన వారి (ఇన్‌స్టిగేటర్స్) నుంచి డబ్బును రికవరీ చేయడానికి ఒక ప్రత్యేక 'స్టాట్యుటరీ క్లెయిమ్స్ కమిషన్' పనిచేస్తుంది. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ కొత్త నిబంధనలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నబన్నాలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
వందేమాతరం రెండు చరణాలనే పాడతాము: కర్ణాటక సీఎం
కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్