నేడే తొలిదశ పోలింగ్
ABN , Publish Date - Apr 23 , 2026 | 06:08 AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో గురువారం 152 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
బెంగాల్‌లో తొలిదశలో 152 స్థానాలకు ఎన్నికలు
జాబితాలో తాజాగా 139 మంది పేర్లు చేర్చిన ఈసీ
బయటి వ్యక్తులకు హోటళ్లలో ఆశ్రయం ఇవ్వొద్దని ఆదేశం
ఈవీఎంలపై ఇంక్, అత్తరు, రసాయనాలు పూస్తే చర్యలు
తమిళనాడులో ఒకే విడతలో 234 స్థానాలకు ఎన్నికలు
కోల్‌కతా, ఏప్రిల్ 22: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో గురువారం 152 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ట్రైబ్యునళ్ల ద్వారా కేసులు పరిష్కారమైన ఓటర్ల వివరాలతో బూత్‌ల వారీ జాబితాలను ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం విడుదల చేసింది. దీంతో వారంతా మొదటి దశ ఎన్నికల్లో ఓటేయడానికి అవకాశం లభించింది. ట్రైబ్యునల్ ఆదేశాలతో తాజాగా మరో 139 మందిని ఓటర్ల జాబితాలో చేర్చారు. దీంతో తొలిదశలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,60,77,310కి చేరింది. ట్రైబ్యునల్ విచారణలు ఈ నెల 27 వరకూ కొనసాగనున్నందున రెండో దశ పోలింగ్‌కు సంబంధించిన ఓటర్ల జాబితా ఇంకా సిద్ధం కాలేదు. ఈలోగా మరికొందరి పేర్లు జాబితాలో చేరే అవకాశం ఉంది. బెంగాల్‌లోని మరో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా, తొలిదశ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నియోజకవర్గానికి చెందని వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని రాష్ట్రంలోని హోటళ్లను ఈసీ ఆదేశించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. కాగా, పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక సూచనలు చేసింది. ఈవీఎంలపై జిగురు, ఇంక్, అత్తరు, రసాయనాలు పూయడమనేది ట్యాంపరింగ్ కిందకు వస్తుందని, దీన్ని తీవ్రమైన ఎన్నికల నేరంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓటింగ్ సరళిని గుర్తించడానికి కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఈవీఎం బటన్లపై ఇటువంటి పదార్థాలు పూస్తున్నట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
తమిళనాడులో 234 స్థానాలకూ..
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుంది. బరిలో నిలిచిన 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనున్న ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి బుధవారం సాయంత్రమే పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,06,418 ఈవీఎంలను వినియోగించనున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు, టీవీకే పార్టీల మఽధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న అంచనాలతో సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ముదస్తు చర్యలు చేపట్టింది. మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాల్లో 5,949 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. దాదాపు 1.5 లక్షల మంది భద్రతా బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు