నేడే బెంగాల్ తుది దశ పోరు
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:44 AM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం మమతా బెనర్జీకి, ప్రధాని మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి. బుధవారం చివరి దశలో భాగంగా ఏడు జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్...
మమత, మోదీల వ్యక్తిగత పోటీగా మారిన ఎన్నికలు
కీలకంగా కోల్‌కతా మహానగరం
ప్రభావం చూపనున్న ‘సర్’
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం మమతా బెనర్జీకి, ప్రధాని మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి. బుధవారం చివరి దశలో భాగంగా ఏడు జిల్లాల్లోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కీలక నేతలైన మమతా బెనర్జీ, బీజేపీకి చెందిన విపక్షనేత సువేందు అఽధికారిల భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. దక్షిణ బెంగాల్‌లోని ఈ నియోజకవర్గాలన్నీ తృణమూల్‌కు కంచుకోటల్లాంటివి కాగా, వాటిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఉత్తర బెంగాల్‌లో కొంతవరకు ప్రభావం చూపగలిగినా, దక్షిణ బెంగాల్‌లోనూ దారులు ఏర్పాటు చేసుకోలుగుతుందా అన్నదాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. మొదటి దశలో హోరాహోరీగా జరిగిన పోరు తర్వాత రెండో దశ రెండు పార్టీలకు మరింత కీలకంగా మారిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఈ 142 సీట్లలో బీజేపీ పలుసీట్లలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. 14 సీట్లలో కేవలం 10వేల తేడాతో ఓడిపోతే, 50 సీట్లను 25 వేల తేడాతో కోల్పోయింది. ఈ సారి ఆ సీట్లను వదలకూడదని కమలనాథులు భావిస్తున్నారు. రెండో దశ సీట్లలో కాంగ్రెస్, వామపక్షాల ప్రాబల్యం ఏమాత్రం లేదని, తృణమూల్, బీజేపీల మధ్యే ప్రత్యక్ష పోటీ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ సీట్లలో తృణమూల్‌దే ఆధిపత్యం కొనసాగింది. బీజేపీ ఓట్ల శాతం పెరిగినా సీట్లు పరంగా పెద్దగా లబ్ధిపొందలేదు. అయితే ఈ సారి సీట్లు పెరుగుతాయని కమలం శ్రేణులు భావిస్తున్నాయి. ఇక్కడ తృణమూల్‌దే ఆధిక్యత అని పలు సర్వేలు చెబుతున్నా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీజేపీ 52ు సీట్లు సాధిస్తాయని అంచనా వేశాయి.
ప్రస్తుతం కోల్‌కతా, హౌరా, ఉత్తర-దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్వ బర్దమాన్ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2021 ఎన్నికల్లో తృణమూల్ 123 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ కేవలం 18 స్థానాల్లో గెలుపొందింది. దక్షిణ బెంగాల్‌లో గెలవకుంటే సచివాలయమైన ‘నబన్నా’కు మార్గం దొరకదన్న నానుడి ఉండడంతో అందరి దృష్టీ తాజా ఎన్నికలపైనే ఉంది. ఇవన్నీ కోల్‌కతా మహానగరం, చుట్టుపక్కల ప్రాంతాలు కావడంతో రాజకీయపరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భబానీపూర్ నియోజకవర్గంలో అయితే ‘మానసిక యుద్ధం’ కూడా జరుగుతోంది. అన్ని రాష్ట్రాల వారు, మతాల వారు ఉన్న ఈ నియోజకవర్గాన్ని ‘మినీ ఇండియా’గా భావిస్తుంటారు సాక్షాత్తూ సీఎం మమతా బెనర్జీ, విపక్ష నేత సువేందు అధికారి ప్రత్యక్షంగా తలపడుతున్నారు. 24 పరగణాల జిల్లాల ఫలితాలే నబన్నా మార్గాన్ని నిర్ణయిస్తాయి. దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ ఎలాంటిదో బెంగాల్‌లో ఈ రెండు జిల్లాల పాత్ర అలాంటిది. మతువా, శరణార్థుల ఓట్లు కారణంగా దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాల్లో బీజేపీ ఇటీవల కాలంలో బలపడింది. అందువల్లనే ఆ పార్టీ అగ్ర నేతలంతా ఈ జిల్లాల్లోనే మకాం వేసి ప్రచారం జరిపారు. అయితే, ‘సర్’లో భాగంగా ఈ జిల్లాల్లో భారీగా ఓట్లను తొలగించడం పోలింగ్‌పై ప్రభావం చూపనుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..