సువేందు అధికారి పీఏ హత్యపై.. బెంగాల్‌లో సిట్ ఏర్పాటు
ABN , Publish Date - May 07 , 2026 | 05:14 PM
బెంగాల్‌లో కీలక బీజేపీ నేత సువేందు అధికారి పీఏ హత్యపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. ఇన్‌స్ఫెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఈ సిట్‌కు నేతృత్వం వహించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నూతన ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్ రథ్ బుధవారం హత్యకు గురైన నేపథ్యంలో పోలీసులు నిందితుల కోసం తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసు శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేసింది.
చంద్రనాథ్ రథ్ హత్య దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహించనున్నారు. వివిధ జిల్లాల పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు కూడా సిట్‌లో భాగంకానున్నాయి. కేసును అన్ని కోణాల్లో పరిశీలించి ఈ కుట్రకు వెనకాల ఉన్న వారిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి పలువురు అనుమానితులు ఇప్పటికే తమ కస్టడీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. అయితే, కాల్పులకు తెగబడ్డ నిందితులు మాత్రం ఇంకా పరారీలో ఉన్నారని చెప్పారు. హిస్టరీ షీట్ ఉన్న ముగ్గురు నిందితుల్ని ప్రశ్నిస్తున్నామని కూడా చెప్పారు.
నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే. కోల్‌కతా నుంచి తన స్కార్పియో కారులో వెళుతున్న చంద్రనాథ్‌ను డోరియా రహదారిపై హత్య చేశారు. ఆయన వాహనాన్ని ఒక కారు అకస్మాత్తుగా ఓవర్ టేక్ చేయగా బైక్‌పై ఉన్న నిందితులు కారు ఎడమవైపు నుంచి వచ్చి నేరుగా చంద్రనాథ్‌పై కాల్పులు జరిపారు. బీజేపీ కార్యకర్తలు గురువారం రాష్ట్రంలో పలు చోట్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
రసవత్తరంగా తమిళనాట రాజకీయాలు.. కోర్టును ఆశ్రయించనున్న విజయ్?
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు! డీఎమ్‌కేలో భిన్న స్వరాలు