Share News

వ్యతిరేకించింది 22 మందే!

ABN , Publish Date - May 14 , 2026 | 06:18 AM

మిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తొలి పరీక్ష నెగ్గారు. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ఆదేశాలతో బుధవారం శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు...

వ్యతిరేకించింది 22 మందే!

బలపరీక్షలో సీఎం విజయ్‌ ఘనవిజయం

విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు

నిలువునా చీలిన అన్నాడీఎంకే

25 మంది ఎమ్మెల్యేల వేరుకుంపటి

ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు

అసెంబ్లీ నుంచి డీఎంకే, డీఎండీకే వాకౌట్‌

ఓటింగ్‌కు ఎండీఎంకే సభ్యులు దూరం

పీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థం

చెన్నై, మే 13 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ తొలి పరీక్ష నెగ్గారు. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ఆదేశాలతో బుధవారం శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. విశ్వాస తీర్మానంపై విజయ్‌ సర్కారుకు 144 మంది మద్దతిచ్చారు. పీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండగా.. 59 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం డీఎంకే, ఒక ఎమ్మెల్యే ఉన్న డీఎండీకే ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్‌ చేశాయి. మరో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోగా.. మాజీ మంత్రి వేలుమణి సారథ్యంలోని 25 మంది ఎమ్మెల్యేలు విజయ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను.. విజయ్‌ సారథ్యంలోని టీవీకే 108 సీట్లు.. డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్‌ 5, పీఎంకే-4 సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ రెండేసి చొప్పున, డీఎండీకే, ఏఎంఎంకే చెరోచోట గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు చోట్ల విజయం సాధించిన విజయ్‌.. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేశారు (పెరంబూర్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు). ఒకే ఒక్క ఓటుతో గెలిచిన తిరుపత్తూర్‌ టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేల సంఖ్య 106కు తగ్గింది. అయితే బలపరీక్షలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్‌, ఏఎంఎంకే సభ్యులు, అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఎండీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.


మా పార్టీని చీలుస్తారా: ఎడప్పాడి

శాసనసభలో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నేతృత్వంలోని 22 మంది విజయ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయగా.. వేలుమణి నేతృత్వంలోని 25 మంది మద్దతుగా నిలిచారు. విశ్వాస తీర్మానంపై చర్చలో పళనిస్వామి మాట్లాడుతూ.. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పిన సీఎం విజయ్‌.. తమ పార్టీని చీల్చి, వారితో భేటీ కావడమేంటని ప్రశ్నించారు. తర్వాత వేలుమణి మాట్లాడుతూ.. ప్రజాభీష్టం మేరకు తామంతా విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.తమ మిత్రపక్షాలతో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను అరువుగా తెచ్చుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న విజయ్‌.. ఎలా సుపరిపాలన అందిస్తారని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. మెజారిటీ లేని ఈ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్న నమ్మకం తనకు లేదని సభలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. ‘పార్టీ ఫిరాయింపులకు ముందు సీఎం అన్నాడీఎంకేలో ఆ వర్గానికి చెందిన నాయకుడి ఇంటికి వెళ్లి కలుసుకోవడమనేది దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. ఈ పరిణామాలన్నీ చూసి మీకు ఓటు వేసిన ప్రజలు.. పెద్ద తప్పు చేశామని ఆలోచించడం మొదలుపెట్టారు’ అని ఉదయనిధి అన్నారు.

ప్రజల రుణం తీర్చుకుంటాం: విజయ్‌

తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో ఎవరి మనసులూ నొప్పించదని, గాయపరచదని.. నమ్మిన ప్రజల రుణం తీర్చుకునేలా తమ పనితీరు ఉంటుందని సీఎం విజయ్‌ స్పష్టంచేశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ‘మాది మైనారిటీ ప్రభుత్వమే. ఈ విషయాన్ని మేమే చెబుతున్నాం. ఇది రాష్ట్రంలోని మైనారిటీలకు రక్షణ కల్పించే ప్రభుత్వం’ అని తెలిపారు. ఇదిలా ఉండగా, తమిళనాడు అసెంబ్లీలో బుధవారం బలపరీక్షలో తిరుపత్తూర్‌ టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి పాల్గొనకుండా మద్రాస్‌ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు విచారణను కూడా నిలిపివేసింది. ఎన్నికల పిటిషన్‌ ద్వారానే ఈ సమస్యను తేల్చాలని హైకోర్టే చెప్పిందని.. మళ్లీ తానే రాజ్యాంగంలోని 226 అధికరణ కింద పిటిషన్‌ను స్వీకరించడం దారుణమని పేర్కొంది. ఈ వ్యవహారంలో రెండు వారాల్లోగా పూర్తి వివరాలు అందించాలని పిటిషనర్‌తో పాటు ఎన్నికల కమిషన్‌ను కూడా ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 06:18 AM