Share News

నేడే విజయ్‌ బలపరీక్ష

ABN , Publish Date - May 13 , 2026 | 05:52 AM

తమిళనాడులో విజయ్‌ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో...

నేడే విజయ్‌ బలపరీక్ష

చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో విజయ్‌ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో తేలిగ్గా బలపరీక్షను నెగ్గనుంది. వాస్తవానికి టీవీకే 108 చోట్ల గెలిచింది. రెండు స్థానాల్లో విజయం సాధించిన విజయ్‌.. తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ఇప్పుడు 107 మందే ఉన్నారు. తాజాగా.. ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన టీవీకే తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే ఓటింగ్‌లో పాల్గొన రాదని మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో టీవీకే బలం 106కి తగ్గిపోయింది. కాంగ్రెస్‌ (5), ఉభయ కమ్యూనిస్టులు (4), వీసీకే (2), ఐయూఎంల్‌ (2), ఏఎంఎంకే(1) మద్దతుతో ప్రస్తుతం విజయ్‌ ప్రభుత్వానికి 120 మంది సభ్యుల బలముంది. 233 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 117. అంటే ప్రభుత్వానికి ముగ్గురు సభ్యులు అధికంగా ఉన్నారు. ఇంకోవైపు.. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి సారథ్యంలోని అన్నాడీఎంకే చీలిక వర్గం ఎమ్మెల్యేలు 30 మంది విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో బలపరీక్షలో సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మా మద్దతు విజయ్‌కే: అన్నాడీఎంకే చీలిక వర్గం

అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి(ఈపీఎ్‌స)పై తిరుగుబావుటా ఎగురవేసిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వారికి నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ జీవీడీ ప్రభాకర్‌నుకలిసి.. ఎస్‌పీ వేలుమణిని తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘డీఎంకేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏర్పాటైన పార్టీ అన్నాడీఎంకే. అలాంటిది ఈపీఎ్‌సను సీఎం చేయడానికి డీఎంకే మద్దతిచ్చేందుకు అంగీకరించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రతిపాదనను అంగీకరించాలని ఈపీఎస్‌ చేసిన వినతిని 90ు మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎన్‌డీఏ నుంచి పూర్తిగా వైదొలగింది. పార్టీని కాపాడే దిశగా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మెజారిటీ శాసనసభ్యులంతా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. కాగా, విజయ్‌ మంగళవారం సాయంత్రం 30మంది అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. షణ్ముగం నివాసానికి వెళ్లిన ఆయనకు వారంతా స్వాగతం పలికారు. కాగా, విజయ్‌ మంత్రివర్గంలోని 9మందిలో ఐదుగురిపై క్రిమినల్‌ కేసులున్నాయని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. సీఎం విజయ్‌ రూ.648.85 కోట్లతో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.


బలపరీక్షకు ఆ ఎమ్మెల్యే దూరంగా ఉండాలి..

శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో ఒక్క ఓటు ఆధిక్యంతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి బుధవారం ఉదయం శాసనసభలో విశ్వాస పరీక్ష ఓటింగ్‌లో పాల్గొనరాదని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. తన నియోజకవర్గంలో పోలైన పోస్టల్‌ ఓట్లను వేలూరు సమీపంలోని తిరుపత్తూరు నియోజకవర్గానికి తరలించడంతో తాను ఒకే ఒక్క ఓటుతో పరాజయంపాలయ్యానని, అందువల్ల పోస్టల్‌ ఓట్లను మళ్లీ లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ డీఎంకే అభ్యర్థి కేఆర్‌ పెరియకరుప్పన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎల్‌. విక్టోరియా గౌరి, జస్టిస్‌ ఎన్‌.సెంథిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణ స్థాయిలో ఉన్నందున.. అసెంబ్లీలో బలపరీక్షలో సేతుపతి పాల్గొనరాదని చెప్పింది. సేతుపతికి 83,365 ఓట్లు పెరియకరుప్పన్‌కు 83,364 ఓట్లు వచ్చాయి.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే

తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి పునరుద్ఘాటన

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు. కొత్తగా కొలువుదీరిన తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం ప్రతిపక్ష నేతగా చేసిన తొలి ప్రసంగంలోనే ఆయన.. ‘‘ప్రజల మధ్య విభజన ఏర్పరిచే సనాతన వ్యవస్థను నిర్మూలించాల్సిందే’’ అని పునరుద్ఘాటించారు. డీఎంకే అధికారంలో ఉండగా ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదం రేపాయి. డీఎంకే ఓటమికి దారితీసిన కారణాల్లో ఇదీ ఒకటి అన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమయింది. కాగా, ‘‘ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ తల్లి ప్రార్థనను మొదటగా ఆలపించాలి. అలాగే శాసనసభలో గవర్నర్‌ ప్రసంగించేటప్పుడు కూడా గతంలోలానే తమిళతల్లి ప్రార్థన, జాతీయ గీతం వరుసగా ఆలపించేలా చూడాలి’’ అని ఉదయనిధి సీఎం విజయ్‌ను కోరారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళ తల్లి ప్రార్థనను ప్రాధాన్యతాక్రమంలో మూడో వరుసలోకి నెట్టేశారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:52 AM