డీఎంకేది అహంకారం!
ABN , Publish Date - May 14 , 2026 | 06:02 AM
తమిళనాడు సీఎం విజయ్ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వం ప్రజల మద్దతు...
మాకు ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యం: విజయ్
చెన్నై, మే 13(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందంటూ విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విజయ్ ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వం ఎదుర్కొన్న విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి ఓటు వేసిన పార్టీల సభ్యులకు ధన్యవాదాలు. శాసనసభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంలో అధికార పార్టీ సభ్యుల ప్రసంగాలను మాత్రమే చూపిస్తూ, విపక్ష సభ్యుల ప్రసంగాలను నిలిపివేయలేదు. ఓటింగ్ సమయంలో సభలో జరిగిన ఏ ఒక్క విషయాన్నీ దాచిపెట్టకుండా పారదర్శకంగా చూపించాం. టీవీకేకు మెజారిటీ ప్రజల మద్దతు లభించలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 2006 ఎన్నికల్లో డీఎంకేకు ఎన్ని సీట్లు వచ్చాయో, అపుడు డీఎంకే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసిందో గుర్తు చేసుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు. అన్నీ తెలిసినట్టు ప్రవర్తించే అహంకారపూరిత డీఎంకే ఎప్పటికీ వాస్తవాన్ని అర్థం చేసుకోదు. తాజా ఎన్నికల్లో టీవీకేకు 34.92 శాతం ఓట్లు వచ్చాయి. డీఎంకేకు వ చ్చిన ఓట్లు 24.19 శాతం మాత్రమే. టీవీకేను 3.21 కోట్ల మంది తిరస్కరించాని డీఎంకే అంటోంది. ఈ లెక్కన డీఎంకేను 3.68 కోట్ల మంది తిరస్కరించారు. ప్రజలపై అప్పుల భారం మోపి.. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నట్టు బుకాయిస్తున్న డీఎంకే గురించి ఏం మాట్లాడతాం? మా పార్టీ లౌకిక వైఖరిలో దృఢంగా ఉండటం వల్లే కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ తదితర పార్టీలు మా ప్రభుత్వానికి మద్దతిచ్చాయి’’ అని విజయ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్