విజయ్‌కు బిగ్‌షాక్!
ABN , Publish Date - May 07 , 2026 | 07:04 AM
ఆదాయాన్ని దాచిపెట్టడం, లెక్కల్లో చూపని నగదు స్వీకరించడం వంటి ఆరోపణలతో విజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను...
ఆదాయ వివరాలను దాచిపెట్టారన్నపిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారణ
చెన్నై, మే 6 (ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని దాచిపెట్టడం, లెక్కల్లో చూపని నగదు స్వీకరించడం వంటి ఆరోపణలతో విజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను రోస్టర్ బెంచ్ ముందు విచారణ కేసుల జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణకు యోగ్యమైనదా కాదా అనే ప్రశ్న తలెత్తడంతో రిజిస్ట్రీ గతంలో దీనిని పక్కనబెట్టింది. గత నెలలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని సోదాల విచారణకు సంబంధించిన సామగ్రి, విజయ్ ప్రమాణ స్వీకార వాంగ్మూలం, ఆస్తుల విచారణ తదితరాలను పరిశీలించి ఐటీ చట్టంలోని సెక్షన్ 276సితో సహా ఇతర విభాగాల కింద విచారణ ప్రారంభించేలా ఐటీ శాఖను ఆదేశించాలని అభ్యర్థించారు. మోసం, నేరపూరిత కుట్రతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా కోరారు. దీనిపై గత నెల 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి.అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం.. పిటిషన్‌కు నంబర్ వేసి రోస్టర్ బెంచ్ ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కానీ రిజిస్ట్రీ నంబర్ ఇవ్వలేదు. బుధవారం ఈ వ్యవహారం ధర్మాసనం ముందుకు రాగా.. ఒక కేసు చట్టరీత్యా విచారణకు యోగ్యం కాకపోవచ్చనే కారణంతో రిజిస్ట్రీ దానికి నంబర్ కేటాయించడానికి నిరాకరించకూడదని స్పష్టంచేసింది. విచారణార్హతను నిర్ణయించే అధికారం దానికి లేదని.. అది కోర్టు విధిగా పేర్కొంది. కేసు పత్రాలు ఇతరత్రా సక్రమంగా ఉంటే తప్పనిసరిగా కేసుకు నంబరు వేయాలని.. ఒకవేళ దానికి విచారణార్హత లేదని రిజిస్ట్రీ భావిస్తే.. ‘విచారణ యోగ్యతకు లోబడి’ అని పేర్కొంటూ పిటిషన్‌ను రోస్టర్ న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించింది. విచారణ యోగ్యతపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ