Share News

స్టాలిన్‌‌ను గుర్తుకు తెస్తూ సైగలు.. సీఎం విజయ్ వీడియో వైరల్

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:48 PM

డీఎంకే అధినేత స్టాలిన్‌ను గుర్తుకు తెస్తూ తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన సైగలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

స్టాలిన్‌‌ను గుర్తుకు తెస్తూ సైగలు.. సీఎం విజయ్ వీడియో వైరల్
CM Vijay Viral Gesture

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో నేడు టీవీకే అధినేత, సీఎం జోసెఫ్ విజయ్, ప్రతిపక్ష డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మధ్య వాడీవేడి సంవాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం విజయ్ ప్రతిపక్ష డీఎంకేపై పలు విమర్శలు గుప్పించారు. పార్టీ ఫండ్స్ పేరిట డీఎంకే డబ్బులు కూడబెట్టుకుంటోందని ఆరోపించారు. దీంతో, ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని డీఎంకే డిమాండ్ చేసింది. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేసింది.

ఎన్నికల అనంతరం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని సీఎం విజయ్ సమర్థించుకున్నారు. డబ్బులతో ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారన్న డీఎంకే ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలను తామే టీవీకే వద్దకు పంపించామని వాళ్లు (డీఎంకే) చెప్పుకుంటున్నారు. మరోవైపు, డబ్బులతో మద్దతు కూడగట్టామనీ మాపై నిందలేస్తున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో పసలేదని, అవి కేవలం తమపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. ఈ వ్యవహారం ముగిసిందనే అర్థం వచ్చేలా చేతితో సైగలు చేశారు. గతంలో స్టాలిన్ చేసిన సైగలను గుర్తుకు తెచ్చేలా రిప్లై ఇచ్చారు. దీంతో, టీవీకే ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బల్లలు చరస్తూ సీఎం విజయ్‌కు మద్దతు తెలిపారు.


గతంలో స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఈ ఏడాది ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్.. మ్యాటర్ సెటిలైందనే అర్థం వచ్చేలా చేతితో సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చిందనే ఉద్దేశంలోనే తాను అలా సైగ చేశానని స్టాలిన్ అప్పట్లో వివరణ ఇచ్చారు. అంతకుమించి మరే ఉద్దేశం లేదని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బాలుడి కస్టడీ వివాదం.. తల్లికి షాక్ ఇచ్చిన పూణే కోర్టు..

ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య.. కుమార్తెతోపాటు ఆమె ప్రియుడే నిందితులు..!

Updated Date - Jun 23 , 2026 | 02:18 PM