గువహాటి వర్సిటీలో రూ.110 కోట్ల అభివృద్ధి పనులకు ఉపరాష్ట్రపతి శంకుస్థాపన
ABN , Publish Date - Sep 07 , 2026 | 08:11 PM
ఈశాన్య భారతంలోనే అత్యంత ప్రాచీనమైన గువహాటి యూనివర్సిటీలో రూ. 110 కోట్ల వ్యయంతో చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ శంకుస్థాపన చేశారు.
గువహాటి (అస్సాం)సెప్టెంబర్ 7: ఈశాన్య భారతంలోనే అత్యంత ప్రాచీనమైన గువహాటి యూనివర్సిటీలో రూ. 110 కోట్ల వ్యయంతో చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ ఇవాళ (సోమవారం) శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కొత్త మల్టీడిసిప్లినరీ అకడమిక్ భవనం, బాలురు, విదేశీ విద్యార్థుల కోసం నూతన వసతి గృహం (హాస్టల్), ఆడిటోరియం, లైబ్రరీ ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.
ఉపరాష్ట్రపతి ప్రసంగం
గువహాటి యూనివర్సిటీ ప్రాధాన్యత: 1948 జనవరి 26న భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్ నాయకత్వంలో జరిగిన ప్రజా ఉద్యమం ద్వారా ఈ యూనివర్సిటీ ఏర్పాటైందని, ఇది ఈశాన్య రాష్ట్రాల్లోనే మొదటి విశ్వవిద్యాలయమని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్ఏఏసీ (NAAC) నుంచి A+ గుర్తింపు పొంది, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF 2025) ర్యాంకింగ్స్‌లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీల్లో 9వ స్థానంలో నిలవడంపై రాధాకృష్ణ ప్రశంసించారు.
భాషా సంస్కృతుల అనుసంధానం: అస్సామీ, తమిళ సాహిత్య రచనలను పరస్పరం అనువాదం చేసుకోవడాన్ని ఆయన స్వాగతించారు. భాషలు నాగరికత జ్ఞానాన్ని మోసుకెళ్తాయని, తమిళనాడు-అస్సాంల మధ్య సాహిత్య మార్పిడి మరింత పెరగాలని ఆకాంక్షించారు.
మహిళా సాధికారత: 2014-15లో 1.57 కోట్లుగా ఉన్న మహిళల ఉన్నత విద్యా ప్రవేశాలు 2023-24 నాటికి 2.24 కోట్లకు (42.2శాతం పెరుగుదల) చేరడం దేశంలో జరుగుతున్న మహిళా సాధికారతకు నిదర్శనమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
యువతకు పిలుపు: 'వికసిత భారత్ @2047' లక్ష్య సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ఈ సందర్బంగా విద్యార్థుల్ని కోరారు. స్వామి వివేకానంద ఇచ్చిన 'లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు విశ్రమించకండి' అనే పిలుపును గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే 'నో టు డ్రగ్స్' (మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం) అని ప్రతిజ్ఞ చేయించారు.
విజ్ఞాన ప్రచురణల్లో భాగంగా ఆయన 'భూపేన్ హజారికా: హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎ వాండరింగ్ సాంగ్స్' పుస్తకంతో పాటు, అస్సామీ నిఘంటువు 'చంద్రకాంత అభిధాన్' 5వ సవరించిన ప్రతిని ఆవిష్కరించారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో విద్య, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పన వేగవంతంగా జరుగుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, విద్యాశాఖ మంత్రి రణోజ్ పెగు, విశ్వవిద్యాలయ ఉపకులపతి (VC) నాని గోపాల్ మహంత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క
రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత