టోలుకు చిల్లు
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:05 AM
టోల్‌బూత్‌లు, బారియర్లు లేకుండా టోల్ వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్‌ఎఫ్ఎఫ్)’ టోల్ ప్లాజాలను విధానాన్ని వేలాది మంది దుర్వినియోగం చేస్తున్నారు!
బ్యారియర్లు లేని ప్లాజాల్లో టోల్ ఎగ్గొడుతున్న వేలాది కార్లు
నంబర్ ప్లేట్, ఫాస్టాగ్ కనపడకుండా చేసి పారిపోతున్న వైనం
ఒక్క టోల్ ప్లాజా పరిధిలోనే 3 నెలల్లో 2.6 లక్షల వాహనాలు
టోల్ ఎగ్గొట్టినట్టు గుర్తింపు.. మరో ప్లాజా పరిధిలో 99 వేలు!
న్యూఢిల్లీ, నవంబరు 20: టోల్‌బూత్‌లు, బారియర్లు లేకుండా టోల్ వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్‌ఎఫ్ఎఫ్)’ టోల్ ప్లాజాలను విధానాన్ని వేలాది మంది దుర్వినియోగం చేస్తున్నారు! ఈ విధానంలో నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించి, దాంతో ఫాస్టాగ్ వివరాలు సరిగ్గా మ్యాచ్ అయితేనే టోల్ రుసుము వసూలవుతుంది. నంబర్ ప్లేట్‌లో నంబర్లు సరిగా కనపడకపోయినా, తప్పుడు నంబర్ ప్లేట్ పెట్టి, ఆర్‌ఎఫ్ఐడీని దేంతోనైనా కప్పివేసినా.. ఆ కారు నుంచి టోల్ కట్ అవదు. దీంతో పలువురు డ్రైవర్లు ఈ లొసుగులను వాడుకుని టోల్ కట్టకుండా ఎగవేస్తున్నారు.
ఈ తరహా కార్లను ‘ఘోస్ట్ కార్లు’గా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు.. రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద మూణ్నెల్ల వ్యవధిలోనే ఇలా 2.6 లక్షల ఘోస్ట్ కార్లు టోల్ కట్టకుండా తప్పించుకొని పోయాయి. ఆ రాష్ట్రంలోనే మనోహర్‌పురా టోల్‌ప్లాజా వద్ద 99,500 ఘోస్ట్ కార్లు తప్పించుకుపోయాయి. ఈ ఘోస్ట్ కార్ల బెడదను తప్పించేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఏఐను వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు జరుపుతున్న చర్చల్లో వివిధ దర్యాప్తు సంస్థలతోపాటు, జీఎస్టీ అధికారులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఎందుకంటే.. టోల్ కట్టకుండా దూసుకుపోతున్న వాహనాలను నేర కార్యకలాపాలకు, జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయా విభాగాలకు చెందినవారిని కూడా ఈ చర్చల్లో భాగం చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల్లో అన్ని వాహనాల వివరాలూ నమోదై ఉంటాయి కాబట్టి..ఎంఎల్‌ఎఫ్ఎఫ్ టోల్ ప్లాజాల గుండా వెళ్లే ఘోస్ట్ కార్లను ఆ వివరాల సాయంతో గుర్తించడానికి కృత్రిమ మేధను వినియోగించాలని ఎన్‌హెచ్‌ఏఐ యోచిస్తోంది. అదెలాగంటే.. ఏదైనా వాహనం ఈ కొత్త టోల్ ప్లాజా గుండా టోల్ కట్టకుండా వెళ్లిపోతే, ఆ వాహనం రంగు, మోడల్ వంటి వివరాలను వాహన్ డేటాబేస్ లో ఉన్న వాహనాలతో పోలుస్తారు. తద్వారా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో అదే భౌతిక వివరాలను(రంగు, ఏ కంపెనీది, ఏ మోడల్ వంటి వివరాలను) కలిగి ఉన్న వాహనాలతో ఒక జాబితాను రూపొందిస్తారు. ఆ వివరాలను ఏఐకి ఇస్తారు. ఉదాహరణకు.. ఒక తెల్లటి సెడాన్ కారు ఎంఎల్‌ఎ్‌ఫఎఫ్ టోల్‌ప్లాజా వద్ద టోల్ ఎగ్గొట్టి వెళ్లిపోయింది. దాని తర్వాత 40 కిలోమీటర్ల దూరంలో మరో మామూలు టోల్‌ప్లాజా ఉందనుకోండి. అక్కడ బ్యారియర్లు ఉంటాయి కాబట్టి ఫాస్టాగ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఏఐ దీన్ని గుర్తించి.. ఎంఎల్‌ఎఫ్ఎఫ్ వద్ద టోల్ ఎగ్గొట్టింది ఈ కారేనని చెబుతుంది. దానికి ఫైన్ వేస్తారు.
ఇలా పనిచేస్తాయి..
సాధారణంగా టోల్ ప్లాజా అంటే.. వాహనాలు రయ్యిన దూసుకుపోకుండా బ్యారియర్లు ఉంటాయి. వాహనం వాటి దగ్గరకు వచ్చి ఆగగానే అక్కడ ఉండే ఆర్‌ఎఫ్ఐడీ రీడర్ వాహనంపై ఉండే ఫాస్టాగ్‌ను రీడ్ చేసి టోల్ రుసుమును వసూలు చేస్తుంది. అప్పుడు వాహనం వెళ్లడానికి వీలుగా బ్యారియర్ పైకి లేస్తుంది. కానీ, ఎన్‌హెచ్‌ఏఐ.. కొత్తగా బ్యారియర్లు లేని టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేస్తోంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా దేశవ్యాప్తంగా 17 చోట్ల వీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. వాటిలో ఆరు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కొత్త టోల్ ప్లాజాల్లో బ్యారియర్లకు బదులు.. పైభాగంలో ఏపీఎన్‌ఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, ఫాస్టాగ్ వివరాలను రీడ్ చేసే ఆర్‌ఎఫ్ఐడీ రీడర్లు, రేడార్, లైడార్ సాంకేతికతలు ఉంటాయి. వాహనం ఎంత వేగంగా వెళ్తున్నా.. కెమెరాలు నంబర్‌ప్లేట్ మీద ఉన్న నంబర్‌ను గుర్తిస్తాయి. ఆర్‌ఎఫ్ఐడీ.. ఫాస్టాగ్ వివరాలను రీడ్ చేస్తుంది. రేడార్లు, లైడార్లు అది ఏ రకమైన వాహనమో గుర్తిస్తాయి. దీంట్లో ఏ వివరాలను గుర్తించలేకపోయినా టోల్ కట్ అవ్వదు. ఈ లొసుగును అడ్డుపెట్టుకునే పలువురు టోల్ ఎగ్గొడుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..