Share News

దీపావళికి పుట్టింటికి వెళ్లి.. అడవుల్లో శవంగా మారిన వివాహిత!

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:52 AM

దీపావళి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి పుట్టింటికి వెళ్లిన ఓ వివాహిత హత్యకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో చోటుచేసుకుంది. 35 ఏళ్ల వర్ష తుర్కార్ తన రెండేళ్ల పాపతో కలిసి దీపావళి వేడుకల కోసం పుట్టింటికి వెళ్లి.. హత్యకు గురైంది.

దీపావళికి పుట్టింటికి వెళ్లి.. అడవుల్లో శవంగా మారిన వివాహిత!
Madhya Pradesh Crime

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి పుట్టింటికి వెళ్లిన ఓ వివాహిత హత్యకు గురైంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల వర్ష తుర్కార్ తన రెండేళ్ల పాపతో కలిసి దీపావళి వేడుకల కోసం పుట్టింటికి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్ష తన స్నేహితుడు నితేష్ అగర్వాల్‌తో కలిసి బయటకు వెళ్లారు. వారు మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులోని గోండియా జిల్లా బోంద్రాని అటవీ ప్రాంతంలోని వైన్ గంగా నది తీర ప్రాంతానికి చేరుకున్నారు.


కొన్ని గంటల తర్వాత నితేశ్ అగర్వాల్.. వర్ష కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలిపాడు. వెంటనే అటవీ ప్రాంతానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు తీవ్ర రక్తస్రావంతో వర్ష కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమెను పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, తమపై కొందరు ముసుగు ధరించిన వ్యక్తులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని నితేశ్ అగర్వాల్ పోలీసులకు తెలిపారు.


కానీ, అంతపెద్ద దాడి జరిగినా నితేశ్‌కు చిన్నపాటి గాయం కూడా కాకపోవడంపై పోలీసులకు అనుమానం కలిగింది. నితేశ్ వాంగ్మూలంలో పొంతన లేకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు గల కారణాలను రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Updated Date - Nov 16 , 2026 | 10:52 AM