Share News

మొత్తం పాడాల్సిందే!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:13 AM

పార్లమెంటు వానాకాల సమావేశాల్లో పలు సంచలన బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా జాతీయ గీతం (జనగణమన)తో పాటు జాతీయ గేయం...

మొత్తం పాడాల్సిందే!

  • వందేమాతరంలోని ఆరు పంక్తులూ ఆలపించాల్సిందే

  • జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, ఫైన్‌

  • 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీయే సర్కారు బిల్లు

  • పునర్విభజన, మహిళాబిల్లు ఆమోదంపైనా ఫోకస్‌

  • విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పించే బిల్లు కూడా..

  • ఒకే సంస్థ ఆధీనంలోకి విద్యా నియంత్రణ సంస్థలు

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు

  • నేడు ఎన్డీయే సమావేశంలో వ్యూహరచన

న్యూఢిల్లీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వానాకాల సమావేశాల్లో పలు సంచలన బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా జాతీయ గీతం (జనగణమన)తో పాటు జాతీయ గేయం (వందేమాతరం) కూడా తప్పనిసరిగా పాడేలా నిబంధన తెస్తూ.. ‘జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టం (ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌-1971)కు సవరణ బిల్లును ప్రతిపాదించనుంది. దీనితో జనగణమన గీతానికి ఉన్న రక్షణ ఇకపై వందేమాతరం గేయానికీ వర్తిస్తుంది. జాతీయ గీతం, గేయంలో దేనిని అవమానించేలా వ్యవహరించినా మూడేళ్ల వరకు శిక్ష, జరిమానాలు విధిస్తారు. అయితే అన్ని అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని ఆరు పంక్తులను చదవాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతం, జాతీయ గేయం రెండూ పాడాల్సి వస్తే జాతీయ గేయానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. కానీ అవి మార్గదర్శక సూత్రాలేనని, తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. చట్టరూపం కల్పించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

  • విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌ రద్దయినా, గడువు తర్వాత పొడిగింపు జరగకపోయినా.. సదరు నిధులతో నిర్మించిన ఆస్తులను స్వాధీనం చేసేందుకు ‘విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు’ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. న్యాయస్థానాలు తేల్చకముందే ఆస్తులను కేంద్ర సంస్థకు బదిలీ చేసేందుకు, కాలపరిమితి పూర్తయిన ఎన్జీవోలు ఆటోమేటిగ్గా రద్దయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

  • యూజీసీ, ఏఐసీటీఈ ఎన్‌సీటీఈ వంటి విద్యారంగ నియంత్రణ సంస్థలను వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్ఠాన్‌ పేరిట ఒకే సంస్థ పరిఽధిలోకి తీసుకువచ్చేందుకు వీలు కల్పించే బిల్లునూ ప్రవేశపెట్టనుంది.

  • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు ఈ సమావేశాల్లోనే చట్టరూపం కల్పించనున్నారు.


పునర్విభజన ఆమోదానికి వ్యూహం

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు సమీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (ఈ నెల 17న) ఢిల్లీలో నిర్వహించనున్న ఎన్డీయే మంత్రుల సమావేశంలో వ్యూహరచన చేయనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో నిర్వహించే ఈ భేటీలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించిన నేపథ్యంలో.. ఈసారి ప్రత్యేక వ్యూహం అమలుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిద్ధమయ్యారని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, మద్దతివ్వని పార్టీల ఎంపీలను సమీకరించడం, అవసరమైతే కొందరిని సభ నుంచి బహిష్కరించడం ద్వారా అయినా కీలక బిల్లులను ఆమోదించుకోవాలని భావిస్తున్నారని వెల్లడించారు.

డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తాం: కాంగ్రెస్‌

ఎన్డీయే సర్కారు మహిళా బిల్లు మాటున పునర్విభజనను ఆమోదించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని.. ఇందుకోసం ప్రతిపక్షాలను చీల్చి మూడింట రెండోవంతు ఎంపీలను సమీకరించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మండిపడ్డారు. గురువారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు పలువురు ఎంపీలు ఇందులో పాల్గొని చర్చించారు. అనంతరం జైరాం రమేశ్‌ మాట్లాడారు. అన్ని పార్టీలను కలుపుకొని పోయి డీలిమిటేషన్‌ను తీవ్రంగా ప్రతిఘటించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రతిపక్షాలు సహకరించాలి: కె.లక్ష్మణ్‌

పార్లమెంటు సమావేశాలను అడ్డుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారం, దేశ హితం కోసం నిర్మాణాత్మక చర్చలు జరపాలని ప్రతిపక్షాలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. నీట్‌, రామమందిర్‌ విరాళాలతో సహా ప్రతి అంశంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ హితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను ప్రధాని మోదీపై అక్కసుతో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.13 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 06:13 AM