అమెరికా మహిళపై లైంగిక దాడి
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:41 AM
భారత పర్యటనకు వచ్చిన అమెరికా మహిళపై కర్ణాటక కొడుగు జిల్లాలో లైంగిక దాడి జరిగింది. విరాజ్‌పేటె తాలూకా కుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని...
కొడగు జిల్లాలో హోంస్టేలో కీచక పర్వం
పానీయంలో మత్తుమందు కలిపి దారుణం
బయటికి పొక్కకుండా మూడు రోజులు వైఫై కట్
ఎట్టకేలకు బయటపడిన బాధితురాలు, ఎంబసీకి మెయిల్
ఎంబసీ నుంచి పోలీసులకు సమాచారం, నిందితుల అరెస్ట్
బెంగళూరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): భారత పర్యటనకు వచ్చిన అమెరికా మహిళపై కర్ణాటక కొడుగు జిల్లాలో లైంగిక దాడి జరిగింది. కొడగు జిల్లా విరాజ్‌పేటె తాలూకా కుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని దేవి విల్లా హోంస్టేలో బాధితురాలు బస చేశారు. అక్కడ పనిచేసే జార్ఖండ్‌కు చెందిన వైజేష్ కుమార్ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయాక లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తనకు ముప్పు తప్పదని భావించిన హోంస్టే నిర్వాహకుడు విశాల్.. బాధితురాలు ఎవరినీ సంప్రదించేందుకు వీలు లేకుండా హోంస్టేకు మూడు రోజుల పాటు వైఫై లేకుండా చేశాడు. లైంగిక దాడి తదనంతర పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు, మైసూరు వెళుతున్నట్టు చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు. జరిగిన దారుణం గురించి అమెరికా రాయబార కార్యాలయానికి మెయిల్ చేశారు. వెంటనే స్పందించిన రాయబార కార్యాలయం, మైసూరు జిల్లా పోలీసులను సంప్రదించింది. వారు కొడుగు జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని, హోంస్టే నిర్వాహకుడు విశాల్, నిందితుడు వైజేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. విదేశీ మహిళపై లైంగిక దౌర్జన్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేశామని, ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మే 3వ తేదీ వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించిందని కొడగు జిల్లా ఎస్పీ బిందుమణి బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి పరమేశ్వర్ బుధవారం బెంగళూరులో మాట్లాడుతూ.. కొడుగు జిల్లా హోంస్టేలో అమెరికా మహిళపై లైంగిక దాడి ఘటనను సీరియ్‌సగా పరిగణిస్తున్నామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేశామని, హోంస్టే నిర్వహణపైనా దర్యాప్తు చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు