Share News

ఒమన్‌ తీరంలో నౌకలపై అమెరికా దాడి

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:27 AM

అరేబియా సముద్రంలో ఒమన్‌ తీరానికి సమీపంలో బుధవారం సెట్టిబెల్లో అనే ఆయిల్‌ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం చేసిన దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించారు...

ఒమన్‌ తీరంలో నౌకలపై అమెరికా దాడి

ముగ్గురు భారతీయ నావికుల మృతి

  • 10న సెట్టిబెల్లో నౌకపై క్షిపణి ప్రయోగం

  • సముద్రంలో గల్లంతైన ముగ్గురు నావికులు

  • 11న వారి మృతదేహాలు లభ్యం

  • మృతుల్లో ఒకరు విశాఖపట్నం వాసి సురేశ్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11: అరేబియా సముద్రంలో ఒమన్‌ తీరానికి సమీపంలో బుధవారం సెట్టిబెల్లో అనే ఆయిల్‌ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం చేసిన దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. వారి మృతదేహాలను ఒమన్‌ తీర రక్షక దళం సహాయంతో గురువారం వెలికి తీశారు. మృతుల్లో విశాఖపట్నంకు చెందిన మెరైన్‌ ఇంజనీర్‌ సురేశ్‌ పట్నాల (44) కూడా ఉన్నారు. అతడికి భార్య భార్గవి.. 13, 10 ఏళ్ల వయసుగల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 24న తమ 15వ వివాహ వార్షికోత్సవానికి వస్తానని సురేశ్‌ చెప్పారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని భార్గవి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒమన్‌ తీరంలో పలావు దేశ పతాకంతో వెళ్తున్న సెట్టిబెల్లో ఆయిల్‌ ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. అందులో 28 మంది సిబ్బంది ఉండగా, 24 మంది భారతీయులు. ఇద్దరు పాకిస్థానీలు, ఉక్రెయిన్‌, రష్యా పౌరులు ఒకరు చొప్పున ఉన్నారు. దాడి జరిగిన వెంటనే 25 మందిని ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. నావికుల మృతిపై భారత నౌకాయాన శాఖ విచారం వ్యక్తంచేసింది. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఒమన్‌ గల్ఫ్‌లో తిష్ట వేసిన అమెరికా నౌకాదళం.. ఆ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోంది. ఈ నెల 8న ఒమన్‌ తీరంలోనే మారివెక్స్‌ అనే ఆయిల్‌ ట్యాంకర్‌పై క్షిపణి దాడి చేయగా, అది తీవ్రంగా దెబ్బతిన్నది. అందులోని 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం సెట్టిబెల్లోపై దాడి చేసింది.


గురువారం కూడా ఒమన్‌లోని షినాస్‌ ఓడరేవుకు సమీపంలో ఎంటీ జల్‌వీర్‌ అనే నౌకపై దాడిచేసింది. దీంతో అందులోని 20 మంది భారతీయ సిబ్బందిని ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించినట్లు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. వాణిజ్య నౌకలపై దాడులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మూడు నౌకలపై అమెరికానే దాడి చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీర్‌ జైస్వాల్‌ గురువారం తెలిపారు. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై వరుస దాడులను ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి హరీశ్‌ పర్వతనేని ఖండించారు. బుధవారం ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్వేచ్ఛాయుత నౌకాయాన చట్టాలను అన్ని దేశాలు గౌరవించాలని పిలుపునిచ్చారు. భారతీయ నావికులు ఉన్న నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. భారతీయ నావికుల మృతికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 06:27 AM