Share News

వీసా పునరుద్ధరణలపై బాదుడు!

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:57 AM

అమెరికాలో వలస నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం భారతీయ టెక్‌ నిపుణులకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటి వరకూ కొత్త హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలకు వసూలు చేస్తున్న ఫీజులను...

వీసా పునరుద్ధరణలపై బాదుడు!

  • హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలకు

  • వేల డాలర్ల ఫీజులు

  • కొత్త రుసుములు విధించే

  • యోచనలో అమెరికా

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అమెరికాలో వలస నిబంధనలను కఠినతరం చేస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం భారతీయ టెక్‌ నిపుణులకు వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటి వరకూ కొత్త హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలకు వసూలు చేస్తున్న ఫీజులను ఇకనుంచి వాటి పొడిగింపుపైనా విధించాలని యోచిస్తోంది. ‘9-11 రెస్పాన్స్‌ అండ్‌ బయోమెట్రిక్‌ ఎంట్రీ-ఎగ్జిట్‌ ఫీజు’ కింద విదేశీ నిపుణులను నియమించుకొనే అర్హత కలిగిన సంస్థలు కొత్త హెచ్‌-1బీ దరఖాస్తుల కోసం 4వేల డాలర్లు, ఎల్‌-1 దరఖాస్తులకు 4,500 డాలర్లు చొప్పున చెల్లిస్తున్నాయి. ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడూ ఈ ఫీజు వర్తిస్తోంది. ఇకపై వీసా పొడిగింపు దరఖాస్తులకు కూడా ఈ రుసుముల చెల్లింపును తప్పనిసరి చేయనున్నారు. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కుమంది ఉద్యోగులు ఉండి, వారిలో కనీసం సగం మంది ఈ వీసాలపై పనిచేస్తున్నవారు ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. హెచ్‌-1బీ వీసాదారుల్లో మెజారిటీ వాటా కలిగిన భారతీయ నిపుణులపైనా, వారిని నియమించుకొనే కంపెనీలపైనా తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యూఎ్‌ససీఐఎస్‌ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో 4,06,348 హెచ్‌-1బీ దరఖాస్తులు ఆమోదం పొందగా, వీటిలో 2,91,542(72ు) పొడిగింపులకు సంబంధించినవి ఉన్నాయి. ఇందులో భారతీయులకు చెందినవే 2,26,359 (77.6ు)గా నమోదయ్యాయి. తాజా నిబంధన అమలులోకి వస్తే పెద్దసంఖ్యలో భారతీయ నిపుణులను నియమించుకొన్న సంస్థలు.. వారిని కొనసాగించుకోవడానికి భారీ మొత్తం వ్యయం చేయాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదన ద్వారా ఏటా అదనంగా 153 మిలియన్‌ డాలర్లు సమకూరుతాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 05:57 AM