దీపావళి వరకు ‘యూపీఐ’ ఉచితం!
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:56 AM
దసరా, దీపావళి పండుగల ముందు వ్యాపారులు, వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది.
ఆ తర్వాతే అమల్లోకి ఎండీఆర్ చార్జీలు
న్యూఢిల్లీ, అక్టోబరు 13: దసరా, దీపావళి పండుగల ముందు వ్యాపారులు, వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను అక్టోబర్ 15కు బదులు, దీపావళి తర్వాత నుంచి అమలు చేస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మంగళవారం ప్రకటించింది. ‘‘పండుగల సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం/వ్యక్తులు వర్తకులకు చేసే చెల్లింపులు) లావాదేవీలపై ఎండీఆర్ను దీపావళి ముగిసిన వెంటనే అమలు చేయాలని ‘యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ’ నిర్ణయించింది. ఏ తేదీ నుంచి అన్నది తర్వాత నోటిఫై చేస్తాం’’అని ఎన్పీసీఐ ప్రకటించింది. ముందు ప్రకటించినట్లుగా అయితే ఈ నెల 15 నుంచే ఎండీఆర్ (ఛార్జీలు) ఛార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. ఏటా దసరా-దీపావళి సమయంలోనే ఆన్లైన్లో, ఆఫ్లైన్లోనూ (స్టోర్లలో) భారీ విక్రయాలు జరుగుతుంటాయి. ఇలాంటి కీలక తరుణంలో ఎండీఆర్ అమలుతో తమపై భారం పడుతుందని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను, ఎండీఆర్ అమలులో సవాళ్లను యూపీఐ స్టీరింగ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తులు వర్తకులకు రూ.2,000 మించి చేసే చెల్లింపులపై 0.4శాతం ఎండీఆర్ అమలు చేయాలని ఎన్పీసీఐ ఇటీవల నిర్ణయించడం తెలిసిందే. రూ.2,000లోపు చెల్లింపులపై ఎలాంటి ఛార్జీల్లేవు. రైల్వే సేవలు, టెలికం బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంధన, యుటిలిటీ, విద్యా సంబంధిత చెల్లింపులపై (రూ.2,000కు మించి) కేవలం రూ.5 ఛార్జీని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక