Share News

పెట్రోల్ పంప్ దగ్గర దారుణం.. యువకుడి చేతులు నరికేసి..

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:36 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ పంప్ దగ్గర గొడవ కారణంగా కొందరు వ్యక్తులు ఘాతుకానికి ఒడిగట్టారు. యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి.. రెండు చేతులు నరికేశారు.

పెట్రోల్ పంప్ దగ్గర దారుణం.. యువకుడి చేతులు నరికేసి..
Mahoba Crime News

లఖ్‌నవూ, జులై 15: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ పంప్ దగ్గర గొడవ కారణంగా కొందరు వ్యక్తులు ఘాతుకానికి ఒడిగట్టారు. యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి.. రెండు చేతులు నరికేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చందేల్‌కు చెందిన జైవేంద్ర సింగ్ మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కాన్పూర్ - సాగర్ హైవే పక్కన ఉన్న పెట్రోల్‌ పంప్ దగ్గరకు వెళ్లాడు. పెట్రోల్ పట్టించుకుంటున్న సమయంలో ఓ గుంపుతో జైవేంద్రకు గొడవ జరిగింది. ఆ గొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది.


ఈ నేపథ్యంలోనే ఆ గుంపు జైవేంద్రపై గొడ్డళ్లతో దాడి చేసింది. రెండు చేతులు నరికేసింది. జైవేంద్ర రెండు చేతులు మణికట్టు వరకు తెగి పక్కకు పడిపోయాయి. తలకు, రెండు కాళ్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం ఆ గుంపు అక్కడినుంచి పరారైంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ జైవేంద్రను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. జైవేంద్రపై దాడి జరగటంలో స్థానిక రాజకీయ నాయకుడి హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జనం భయాందోళనకు గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి

యువతలో నైపుణ్యానికి పదును

ఒక్క రోజులో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి.. ఇంతకీ ఐబీఎంలో ఏం జరుగుతోంది..

Updated Date - Jul 15 , 2026 | 11:39 AM