Share News

ఒక్క రోజులో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి.. ఇంతకీ ఐబీఎంలో ఏం జరుగుతోంది..

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:28 AM

అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఐబీఎం షేర్లు గత 58 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే కుప్పకూలాయి. ఒక్క రోజులోనే కంపెనీ షేర్లు సుమారు 25 శాతం వరకు పడిపోవడంతో దాదాపు 70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.7 లక్షల కోట్లు) మార్కెట్ విలువ ఆవిరైంది.

ఒక్క రోజులో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి.. ఇంతకీ ఐబీఎంలో ఏం జరుగుతోంది..
IBM stock crash

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) షేర్లు గత 58 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే కుప్పకూలాయి. ఒక్క రోజులోనే కంపెనీ షేర్లు సుమారు 25 శాతం వరకు పడిపోవడంతో దాదాపు 70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.7 లక్షల కోట్లు) మార్కెట్ విలువ ఆవిరైంది. తాజా త్రైమాసిక ప్రాథమిక ఫలితాలు మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఉండడం, అలాగే ఏఐ (AI) విప్లవానికి తగిన వేగంతో స్పందించలేకపోయామని సీఈఓ అరవింద్ కృష్ణ స్వయంగా వెల్లడించడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది.


అరవింద్ కృష్ణ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో.. 'మేము కొన్ని అంశాల్లో తడబడ్డాం. వేగంగా మారుతున్న ఏఐ పరిస్థితులకు అనుగుణంగా త్వరగా స్పందించలేకపోయాం' అని పేర్కొన్నారు. అలాగే వినియోగదారులు సాఫ్ట్‌వేర్, కన్సల్టింగ్ సేవలపై కాకుండా.. సర్వర్లు, స్టోరేజ్, ఏఐ మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఖర్చు చేయడం కంపెనీ ఆదాయంపై ప్రభావం చూపిందని వివరించారు.


జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐబీఎం ఆదాయం కేవలం 1 శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఇది విశ్లేషకుల అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది. సాఫ్ట్‌వేర్ విభాగం ఆశించినంతగా వృద్ధి చెందకపోవడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 7 శాతం తగ్గడం కూడా నిరాశ కలిగించింది. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏఐ యుగంలో తమ వ్యాపార నమూనాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెడ్ హ్యాట్ వంటి వ్యాపారాలు, ఏఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు భవిష్యత్తులో ఐబీఎంకు ఊతమివ్వవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లోకి స్పెయిన్.. ఫ్రాన్స్‌పై 2-0తో ఘన విజయం

Updated Date - Jul 15 , 2026 | 11:28 AM