కేక్ ముఖానికి పూశారని స్నేహితుల హత్య.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..
ABN , Publish Date - May 01 , 2026 | 07:49 AM
బర్త్‌డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో ముగ్గురు స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైనీ ఎన్‌కౌంటర్‌లో బలయ్యాడు. గురువారం ధారవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బర్త్‌డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో ముగ్గురు స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైనీ ఎన్‌కౌంటర్‌లో బలయ్యాడు. గురువారం ధారవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జీతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌లో ఉండగా ఓ స్కూటర్ అటువైపు వచ్చింది. ఆ స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు.
పోలీసులను చూడగానే స్కూటర్ నడుపుతున్న వ్యక్తి స్పీడ్ పెంచాడు. వెనకాల కూర్చున్న జీతూ తుపాకితో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. స్కూటర్ పోలీసులకు దొరకకుండా వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయింది. పోలీసులు స్కూటర్‌ను ఛేజ్ చేశారు. ఝఘర్ రోడ్‌లో స్కూటర్‌ను చుట్టుముట్టారు. నిందితుడు జీతూ పోలీసులపై కాల్పులు జరిపి అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆత్మ రక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీతూ తీవ్రంగా గాయపడ్డాడు. రెండో వ్యక్తి అక్కడినుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు గాయపడ్డ జీతూను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జీతూ ప్రాణాలు కోల్పోయాడు.
కేసు వివరాలు..
బులందేశ్వర్ జిల్లాలోని ఖుర్జా ఏరియాకు చెందిన జీతూ సైనీ పుట్టిన రోజు సందర్భంగా గత శనివారం రాత్రి సుభాష్ రోడ్‌లోని ఆర్‌జేఎస్ ఫిట్‌నెస్ జిమ్‌లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి జీతూ ఫ్రెండ్స్ వచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో జీతూ కేక్ కట్ చేశాడు. అతడి స్నేహితులు కేక్‌ను జీతూ ముఖానికి పూశారు. దీంతో ఆగ్రహానికి గురైన జీతూ స్నేహితులతో గొడవ పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి సోదరుడి లైసెన్స్ తుపాకి వెంట తెచ్చుకున్నాడు. స్నేహితులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 35 ఏళ్ల అమర్ దీప్, 32 ఏళ్ల మనీష్, 19 ఏళ్ల ఆకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం నుంచి జీతూ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిపై 50 వేల రూపాయల రివార్డ్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
పెరిగిన టమాటా, బీరకాయ.. తగ్గిన కాకర, వంకాయ
స్థిరంగా బంగారం ధరలు, స్వల్పంగా పెరిగిన వెండి రేటు