ఖమేనీ, నెతన్యాహు.. బతికే ఉన్నారా?
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:53 AM
యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే (నిజం)’’ ..మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనెటర్ హైరామ్ జాన్సన్ సెనెట్‌లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది! యుద్ధం జరిగిన ప్రతిసారీ అది రుజువవుతూనే ఉంది....
నెతన్యాహు, ఖమేనీల ఉనికిపై సందేహాలు
ఇజ్రాయెల్ దాడిలో మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడా కనిపించని ఇద్దరు నేతలు
ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ‘ది సన్’ కథనం
బతికే ఉన్నారుగానీ.. బాగా దెబ్బతిన్నారు: ట్రంప్
జూమ్‌లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహూ
ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు
అది ఏఐ వీడియో అని పలువురి అనుమానం
ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు
పట్టించుకోనట్టుగా.. జవాబులిచ్చిన నెతన్యాహు
న్యూఢిల్లీ, మార్చి 13: ‘‘యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే (నిజం)’’ ..మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనెటర్ హైరామ్ జాన్సన్ సెనెట్‌లో చేసిన ప్రసంగంలో అన్న మాట ఇది! యుద్ధం జరిగిన ప్రతిసారీ అది రుజువవుతూనే ఉంది!! యుద్ధ సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలో, ఏవి అబద్ధాలో.. ఏది ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి చేసే ప్రచారమో.. ఏది ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు ఆడే ఆటో.. ఏదీ తెలియదు. ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. ఆపరేషన్ రోరింగ్ లయన్’’ అనే పేర్లతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలోనూ అదే పరిస్థితి నెలకొంది. యుద్ధం తొలిరోజే మరణించిన ఆయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు, ఇరాన్ సుప్రీం లీడర్‌గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ కూడా ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో చనిపోయినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుప్రీం లీడర్‌గా నియమితుడైనప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆయన ఎక్కడా భౌతికంగా కనిపించకపోవడం.. ఆ వార్తలు నిజమేనన్న అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే.. వందలాది మంది ఇరానియన్లు మొజ్తబా చిత్రపటానికి విధేయత (ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నామని) తెలుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరాన్‌లో నేతలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చిత్రపటానికి విధేయత తెలిపే అలవాటు ఉంది.
యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నందునే వారు ఇలా చిత్రపటానికి విధేయత తెలుపుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మొజ్తబాకు గాయాలు అయ్యాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గతంలో ఒకసారి పేర్కొనడం వారి విశ్లేషణకు ఆధారం. తాజాగా బ్రిటిష్ పత్రిక ‘ది సన్’ కూడా.. ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు కోల్పోయారని.. ఆయన కడుపు, కాలేయం చిట్లిపోయాయని.. వైద్యులు ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తున్నారని అందులో పేర్కొంది. మొజ్తబా ఉన్న ఆస్పత్రి విభాగాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయని.. ఆయన ప్రత్యక్ష ఆదేశాలు లేకుండానే ఇరాన్ నాయకత్వం ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికార వర్గాలు మాత్రం.. మొజ్తబా ఎప్పుడో చనిపోయారని.. కానీ, ఆ విషయాన్ని ఇరాన్ దాచిపెడుతోందని, తొలుత ఆయన కోమాలో ఉన్నారని చెప్పి, ఆ తర్వాత కొన్నాళ్లకు చనిపోయారని ప్రకటిస్తుందని చెబుతున్నాయి. అయితే.. ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ మరణ వార్తలను ఖండిస్తున్నాయి. ఆయన బతికే ఉన్నారనేందుకు నిదర్శనంగా.. ఖమేనీ ప్రకటనను గురువారం విడుదల చేశాయి. కానీ.. ఆయన నిజంగానే బతికే ఉంటే, కనీసం ఒక్క నిమిషమైనా లైవ్ వీడియోలో కనిపించి ప్రజలకు ధైర్యం చెప్పి ఉండొచ్చుకదా? అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇజ్రాయెల్ సంగతి అలా ఉంటే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. మొజ్తబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నారుగానీ, బాగా దెబ్బతిన్నారని.. ‘ఫాక్స్ న్యూస్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక.. ఖమేనీ తీవ్రగాయాలపాలయ్యారని, గుర్తుపట్టలేని విధంగా మారారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు.
నెతన్యాహు సంగతేంటి?
తమ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్న రక్షణ కేంద్రం (బంకర్) దెబ్బతిందని, ఆయన మరణించారని పేర్కొంటూ.. ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ, ప్రెస్ టీవీ వంటి సంస్థలు పలు కథనాలను ప్రసారం చేశాయి. ఆ కథనాలకు తగ్గట్టుగానే.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఖమేనీలాగానే నెతన్యాహు కూడా ఎక్కడా భౌతికంగా కనపడకపోవడం గమనార్హం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన మొదటిరోజు (ఫిబ్రవరి 28వ తేదీన) ఆయన ఒక రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. మళ్లీ మార్చి 7న... ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందిస్తూ మరో వీడియో విడుదల చేశారు. కానీ, ఆ వీడియో ముందే రికార్డు చేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా మార్చి 12న ఆయన వీడియో లింక్ ద్వారా మీడియా ముందుకు వచ్చారు. మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. కానీ.. అది కృత్రిమమేధతో ఎడిట్ చేసిన వీడియో అని.. అందులో ఉన్నది నిజంగా నెతన్యాహు కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ప్రశ్నలు అడిగిన విలేకరులు ఎక్కడా కనిపించలేదు. వారి గొంతులు మాత్రమే వినిపించాయి. ఆద్యంతం నెతన్యాహు ఒక్కరే తెరపై కనిపించారు. వీడియోలో కొన్ని సందర్భాల్లో ఆయన కుడిచేతికి ఆరు వేళ్లు కనపడ్డాయని.. ఎడమచేతి వేళ్లన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయని.. అది ఏఐ వీడియో కావడం వల్లే అలా జరిగిందన్నది ఆ వీడియోను అనుమానించేవారి వాదన. ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన చాలా యాంత్రికంగా సమాధానాలు చెప్పారని.. ఆయన ఎప్పుడూ చెప్పినట్టుగా నిర్దిష్టమైన సమాధానాల్లా కాకుండా అవి జనరల్ స్టేట్‌మెంట్లలా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్‌లో యుద్ధ సైరన్లు మోగాయి. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఎంత పెద్ద నేత అయినా ఏం జరిగింది? అన్నట్టుగా చూస్తారు. కానీ, నెతన్యాహు కనీసం కనురెప్ప సైతం ఆర్పకుండా, సైరన్ శబ్దాన్ని విననట్టుగా, పట్టించుకోనట్టుగా.. తాను అనుకున్నది చెప్పుకొంటూ పోయారు.

ఇరాన్‌లో ప్రజల ర్యాలీకి సమీపంలో పేలుళ్లు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వేలాది మంది ప్రజలు, నేతలు గుమిగూడి ఉన్న సెంట్రల్ స్క్వేర్ ప్రాంతానికి సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాలస్తీనియులకు సంఘీభావంగా, ఇజ్రాయెల్ నాశనం కావాలన్న డిమాండ్‌తో ఇరాన్ ప్రభుత్వం ఏటా నిర్వహించే ‘ఖడ్స్ డే ర్యాలీ‘ని శుక్రవారం నిర్వహించారు. ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజని, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘొలమ్‌హోసేన్ మొహ్సెనీతోపాటు ఇతర కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఇజ్రాయెల్‌కు, అమెరికాకు అంతం తప్పదు’ అని నినాదాలు చేశారు. ఇలా వేలాది మంది గుమిగూడి ఉన్న సమయంలో.. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఒక హెచ్చరికను జారీ చేసింది. కాసేపటికే ఆ ప్రాంతానికి సమీపంలో భారీ పేలుళ్లు జరిగి, నల్లటి దట్టమైన పొగలు వెలువడ్డాయి. అయితే ప్రజలెవరూ పెద్దగా ఆందోళన చెందకుండా ‘దేవుడు గొప్పవాడు’ అంటూ నినాదాలు చేయడం కనిపించింది.
లెబనాన్‌పై శుక్రవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 8 మంది మృతిచెందారు, మరో 9 మంది గాయపడ్డారు. మొత్తంగా ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 773కు చేరినట్టు లెబనాన్ ప్రకటించింది. 1,900 మంది గాయపడ్డారని తెలిపింది.
ఇక బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి.. యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల హ్యాంగర్, ఇంధన ట్యాంకులను ధ్వంసం చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది.
తమ దేశంలోని వివిధ ప్రాంతాలపైకి ఇరాన్ ప్రయోగించిన 50కిపైగా డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ అరేబియా శుక్రవారం ప్రకటించింది.
ఇరాక్‌లోని ఎర్బిల్ విమానాశ్రయం, సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఫ్రెంచ్ సైనికుడు ఒకరు మృతిచెందారని, ఆరుగురు గాయపడ్డారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు.
దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాకు సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. రెండు భవనాల వద్ద భారీ పేలుళ్లు సంభవించి, దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయని దుబాయ్ మీడియా ఆఫీసు వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపింది.
దుబాయ్‌పై డ్రోన్ దాడులు, వాటిని అడ్డుకునేందుకు జరుగుతున్న క్షిపణి ప్రయోగాలను వీడియో తీసిన 60 ఏళ్ల బ్రిటీషు పర్యాటకుడిని యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు. యూఏఈ చట్టాల ప్రకారం అది నేరమని, దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ పూర్తి మద్దతు, సహకారం అందజేస్తుందని పాక్ ప్రదాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆయన జెడ్డాలో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి చర్చించారు.