Share News

చింపాంజీల మధ్య అంతర్యుద్ధం

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:31 AM

మనుషులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నట్లే ఉగాండాలో చింపాంజీలు రెండు వర్గాలుగా విడిపోయి చంపుకుంటున్నాయి. రోజులు.. వారాలు.. కాదు, ఈ వైరం పదకొండేళ్లుగా కొనసాగుతోంది...

చింపాంజీల మధ్య అంతర్యుద్ధం

ఉగాండాలో 2 గ్రూపులుగా విడిపోయి చంపుకొంటున్న చింపాంజీలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: మనుషులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నట్లే ఉగాండాలో చింపాంజీలు రెండు వర్గాలుగా విడిపోయి చంపుకుంటున్నాయి. రోజులు.. వారాలు.. కాదు, ఈ వైరం పదకొండేళ్లుగా కొనసాగుతోంది. హాలీవుడ్‌లోని ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ఏప్స్‌’ సినిమాను తలపిస్తున్న ఈ చింపాంజీల అంతర్యుద్ధం శాస్త్రవేత్తలకు, జంతు అధ్యయనవేత్తలకు మిస్టరీగా మారింది. ఉగాండాలో కిబాలే పేరుతో ఓ నేషనల్‌ పార్కు ఉంది. ఇందులో 200కు పైగా చింపాంజీలు ఉన్నాయి. 1995నుంచి 2015వరకు ఈ చింపాంజీలు కలిసిమెలిసి ఉండేవి. కానీ, ఏమైందో తెలియదు. 2015జూన్‌ 24న ఈ చింపాంజీలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఆ రోజు వింతగా ప్రవర్తించాయి. ఒక గ్రూపునకు(సెంట్రల్‌) చెందిన చింపాంజీలు మరో చింపాంజీల గ్రూపు(వెస్టర్న్‌) దగ్గరికి వచ్చాయి. సమావేశం నిర్వహించాయి. వైరం మొదలయ్యాక నేషనల్‌ పార్కులో అవి ఉండే ప్రదేశాన్ని బట్టి పరిశోధకులు ఆ చింపాంజీలకు సెంట్రల్‌ గ్రూపు, వెస్టర్న్‌ గ్రూపు అని పేర్లు పెట్టారు. ఈ సమావేశంలో సెంట్రల్‌ గ్రూపులోని ఆల్ఫా మేల్‌ చింపాంజీ వెస్టర్న్‌ గ్రూపు చింపాంజీలపై గట్టిగా అరిచింది. దానికి వెస్టర్న్‌ గ్రూపు చింపాంజీలు మౌనంగా ఉన్నాయి. తర్వాత పారిపోయాయి. సెంట్రల్‌ గ్రూపు చింపాంజీలు వాటి వెంట పడి దాడి చేశాయి. ఆరోజు అలా గడిచిపోయింది. ఆనాడు సాండేల్‌ అనే జంతు అధ్యయన వేత్త చింపాంజీల ఈ వింత ప్రవర్తనను చూశాడు. అప్పటి నుంచి ఆ చింపాంజీలను గమనించడం మొదలుపెట్టాడు.


2017కల్లా ఈ రెండు గ్రూపులు నేషనల్‌ పార్కులో తమ నివాస ప్రాంతాలను సుస్థిరం చేసుకున్నాయి. మరో గ్రూపునకు చెందిన చింపాంజీలను తమ అడ్డాలోకి రాకుండా అవి కాపలా ఉండేవి. తమ సరిహద్దుల్లో గస్తీ నిర్వహించేవి. 2018లో ఈ రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. పలు చింపాంజీలు చనిపోయాయి. 2018-24 మధ్యలో వెస్టర్న్‌ గ్రూపు చింపాంజీలు సెంట్రల్‌ గ్రూపునకు చెందిన 7పెద్ద చింపాంజీలు, 17 పిల్ల చింపాంజీలను చంపేశాయి. ఇదే గ్రూపులో ఇంకా 15చింపాంజీలు కనిపించకుండా పోయాయి. ఇవి కూడా వెస్టర్న్‌ గ్రూపు చేతిలో చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో(200కు పైగా) చింపాంజీలు ఒకే చోట ఉండటం, సమూహం అంతకంతకూ పెరుగుతూ ఉండటం వల్ల ఆహారం కోసం గొడవ వచ్చి అవి విడిపోయి ఉంటాయని సాండేల్‌ అభిప్రాయపడ్డారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2014కు ముందు ఈ నేషనల్‌ పార్కులో కొన్ని వృద్ధ చింపాంజీలు చనిపోయాయి. ఫలితంగా మిగిలిన చింపాజీలను కలిపి ఉంచే పెద్ద చింపాంజీలు లేకుండా పోయాయి అని సాండేల్‌ అన్నారు. తన ఈ అధ్యయనాన్ని సైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 07:59 AM