ఉదయనిధి అరెస్ట్.. విడుదల
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:52 AM
డీఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. సినీ నటి త్రిషను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. కావేరి నదీజలాలు, మెకెదాటు సమస్యలపై..
ప్రశ్నించి వదిలేసిన తంజావూరు పోలీసులు
త్రిషపై వ్యాఖ్యలతో తమిళనాట దుమారం
రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరసనలు
నన్ను ఉగ్రవాదిలా చూశారు: ఉదయనిధి
అహంకారం వినాశనానికి దారి: స్టాలిన్
ఉదయనిధి అరెస్ట్.. విడుదల
త్రిషపై వ్యాఖ్యలతో తమిళనాట దుమారం
చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): డీఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. సినీ నటి త్రిషను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. కావేరి నదీజలాలు, మెకెదాటు సమస్యలపై టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తంజావూరులో సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి విజయ్... కావేరి సమస్యపై నోరు మెదపడం లేదని అన్నారు. ఆయన కేవలం డీఎంకేను, తమ అధినేత స్టాలిన్‌ను విమర్శించడంపైనే దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త అదే పనిగా ‘త్రిషా.. త్రిషా..’ అంటూ నినదించాడు. ఈ సందర్భంగా ఉదయనిధి... ‘కావేరి నీరు మరెక్కడికి చేరినా చేరకపోయినా, కనీసం అక్కడికైనా చేరాలి’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవారంతా పెద్దగా నవ్వగా.. తాను కావేరి నదిని ఉద్దేశించి అంటున్నానని వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీవీకే కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పోలీసులతోపాటు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఉదయనిధిపై టీవీకే తంజావూరు మహిళా విభాగం అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. మంగళవారం ఉదయం చెన్నైకి వచ్చి ఆయనను అరెస్టు చేశారు. ఈ లోపు ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి హైకోర్టును ఆశ్రయించగా.. 12 గంటల వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, మధ్యాహ్నం పిటిషన్‌పై విచారణ జరుపుతామని న్యాయమూర్తి ఇళందిరియన్ పేర్కొన్నారు. మధ్యాహ్నం విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉదయనిధిని తంజావూరు పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్తున్నారని, విచారణ అనంతరం విడుదల చేస్తారని తెలిపారు. కాగా... ఉదయనిధిని తంజావూరు దక్షిణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారని తెలుసుకున్న వేలాదిమంది డీఎంకే నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయే అవకాశముందని భావించిన పోలీసులు.. ఉదయనిధిని సెంగిపట్టికి తరలించారు. సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8.15 గంటల వరకు విచారించి వదిలిపెట్టారు.
ఉదయనిధి క్షమాపణలు చెప్పాలి: ఖుష్బూ
నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరోవైపు, అహంకారం వినాశనానికి దారి తీస్తుందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ టీవీకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉదయనిధి తొందరపడి ఎవ్వరినీ తప్పుగా మాట్లాడరని.. ఒకవేళ అలా మాట్లాడినా ఆయన వెంటనే క్షమాపణ చెబుతారని వివరించారు.
ప్రభుత్వం నన్ను ఉగ్రవాదిలా చూసింది: ఉదయనిధి
సీఎం విజయ్ ప్రభుత్వం తనను ఓ ఉగ్రవాదిలా చూసిందని ఉదయనిధి ఆరోపించారు. ‘‘దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించి, నన్ను ఒక ఉగ్రవాదిలా చెన్నై నుంచి తంజావూరుకు తీసుకెళ్లారు’ అన్నారు. ఇదొక రాజకీయ ప్రేరేపిత కేసు అని అన్నారు. తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా వ్యాఖ్యానించానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. సింగిల్ మీనింగ్‌లోనే మాట్లాడనన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..