త్రిషను ఉద్దేశిస్తూ డబుల్ మీనింగ్ కామెంట్స్.. ఉదయనిధిపై కేసు
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:00 AM
తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తంజావూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. త్రిషను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తంజావూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నటి త్రిషను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ నదీ జలాల పంపిణీపై వివాదం నెలకొంది. రాష్ట్రానికి కావాల్సిన నీటిని తేవడంలో తమిళనాడు సీఎం విజయ్ విఫలమయ్యారని డీఎంకే ఆరోపిస్తోంది.
ఈ సందర్భంగా ఉదయనిధి ఒక ర్యాలీ నిర్వహించారు. నదీ జలాల పంపిణీపై ప్రసంగిస్తున్న తరుణంలో ప్రజల్లో కొందరు త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి స్పందిస్తూ దురర్థాలు వచ్చే వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్రంలో దుమారానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధిపై టీవీకే, బీజేపీ మండిపడ్డాయి.
ఉదయనిధి ప్రసంగం అసభ్యంగా ఉందని టీవీకే నేత, మంత్రి అర్జున మండిపడ్డారు. అన్నాదురై నిర్మించిన ఉద్యమాన్ని ఉదయనిధి తన అసభ్యకరమైన భాష, డబుల్ మీనింగ్ డైలాగులతో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఒక అసభ్య నిధి అని వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఏ మహిళ, తల్లి సోదరి ఈ వ్యాఖ్యలను సహించరని అన్నారు. మహిళలు ఉదయనిధిని తమిళనాడు రాజకీయాల్లో లేకుండా చేస్తారని హెచ్చరించారు.
ప్రతిపక్ష నాయకుడైన ఉదయనిధి తన కూతురు, కుమారుడి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని సూటి ప్రశ్న సంధించారు. బీజేపీ కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించింది. ఆయన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా, సిగ్గుతో తలదించుకునేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
డీఎంకే నేతలు మాత్రం ఉదయనిధి కామెంట్స్‌ను సమర్థించే ప్రయత్నం చేశారు. రాజకీయ ఉద్దేశాలతో ఈ కాంట్రవర్సీని సృష్టించారని మాజీ మంత్రి, డీఎంకే నేత టీ మనో తంగరాజ్ అన్నారు. కావేరీ జలాల వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే అసలు ఉద్దేశమని చెప్పారు.
E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ప్రధాని మోదీ నివాసానికి కేజ్రీవాల్ మార్చ్
ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు