Share News

సుప్రీం కోర్టుకు టీవీకే!

ABN , Publish Date - May 09 , 2026 | 06:18 AM

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించేలా గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు...

సుప్రీం కోర్టుకు టీవీకే!

ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని అభ్యర్థన

విజయ్‌ను తప్ప మరే కూటమినీ పిలవకుండా అడ్డుకోవాలని వినతి

అత్యవసరంగా విచారించాలని కోరిన ఆ పార్టీ సభ్యుడు ఎళిలరసి

న్యూఢిల్లీ, మే 8: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించేలా గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడం రాజ్యాంగంలోని 12, 32 అధికరణలను గవర్నర్‌ ఉల్లంఘించడమేనని ఎళిలరసి.కె అనే వ్యక్తి శుక్రవారం ఈ వ్యాజ్యం వేశారు. తాను న్యాయవాదినని.. టీవీకే క్రియాశీల సభ్యుడినని తెలిపారు. ‘టీవీకే అధినేత సి.జోసెఫ్‌ విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ గానీ లేదా అలాంటి ఇతర ఆదేశాల ద్వారా తమిళనాడు గవర్నర్‌ను ఆదేశించండి’ అని వ్యాజ్యంలో కోరారు. ప్రతివాదులుగా గవర్నర్‌ ముఖ్య కార్యదర్శిని, రాష్ట్రప్రభుత్వాన్ని, కేంద్రప్రభుత్వాన్ని చేర్చారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ‘సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం.. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు మొదట పిలవడం.. ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పడం గవర్నర్‌ కర్తవ్యం. జోసెఫ్‌ విజయ్‌ అతిపెద్ద పార్టీ నేత. అయితే ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుంటున్న సంకీర్ణ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించబోతున్నారని మీడియా ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు నిర్దేశిత న్యాయసూత్రాలకు ఇది విరుద్ధం. ప్రజాస్వామ్యానికే మృత్యుఘంటిక. ప్రజాస్వామ్య సంరక్షకురాలు సర్వోన్నత న్యాయస్థానమే. టీవీకేని తప్ప మరే రాజకీయ కూటమినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్‌ను నిరోధించాలి’ అని ఆయన అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 06:18 AM