ఎస్‌జే సూర్య సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు..
ABN , Publish Date - Jun 03 , 2026 | 10:34 AM
ఎస్ జే సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చెన్నై, జూన్ 3: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పెరంబూర్ బిన్నీ మిల్ ప్రాంగణంలో ‘కిల్లర్’ సినిమా షూటింగ్ జరుతోంది. బుధవారం ఉదయం ఊహించని విషాదం చోటుచేసుకుంది.
షూటింగ్‌లో ఉపయోగిస్తున్న కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు కారణంగా 25 ఏళ్ల మదన్ అనే యువకుడితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడివారు అప్రమత్తం అయ్యారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మదన్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ఈ ఘటనతో సినిమా యూనిట్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎస్‌జే సూర్య అక్కడే ఉన్నారా? లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎస్ జే సూర్య నుంచి కానీ, సినిమా టీమ్ నుంచి కానీ, ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇవి కూడా చదవండి
ప్రపంచ నెం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. చమురు ధరలకు రెక్కలు!