Share News

మమతకూ ‘మహా’గతే!

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:18 AM

మమతా బెనర్జీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు ఏకబిగిన పాలించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నిట్టనిలువునా చీలిపోయింది. 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో...

మమతకూ ‘మహా’గతే!

  • నిలువునా చీలిన తృణమూల్‌.. దీదీకి 58 మంది ఎమ్మెల్యేల షాక్‌

  • బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రతను ఎన్నుకున్న వైనం

కోల్‌కతా, జూన్‌ 3: మమతా బెనర్జీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు ఏకబిగిన పాలించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నిట్టనిలువునా చీలిపోయింది. 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆ పార్టీ మమత చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదం ఏర్పడింది. మహారాష్ట్రలో శివసేనను ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి ఏక్‌నాథ్‌ షిండే, ఎన్‌సీపీని శరద్‌ పవార్‌ నుంచి అజిత్‌ పవార్‌ కైవసం చేసుకున్నట్లే.. తృణమూల్‌ను కూడా బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ(46) చేజిక్కించుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మమత నియమించిన శోభన్‌దేవ్‌ను కాదని రితబ్రతను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ 58మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బుధవారం స్పీకర్‌ రతీంద్ర బోస్‌కు లేఖ రాశారు.

ఆ లేఖను రితబ్రత, మరో బహిష్కృత ఎమ్మెల్యే సందీపన్‌ సాహా ఆయనకు స్వయంగా సమర్పించారు. ఉప నేతలుగా జావేద్‌ ఖాన్‌, సందీపన్‌ సాహా, షివులీ సాహా, సబీనా యాస్మిన్‌లను, అఖ్రుజ్జమాన్‌ను చీఫ్‌ విప్‌గా ఎన్నుకున్నట్లు సభాపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. స్పీకర్‌ను, సీఎం సువేందు అధికారిని కలిసినందుకు రితబ్రత, సాహాను మమత గత సోమవారం పార్టీ నుంచి బహిష్కరించారు. అదేరోజు పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ భేటీని మమత రద్దుచేశారు. కాగా, తమ అభ్యర్థనను స్పీకర్‌ తక్షణమే అంగీకరించారని రితబ్రత మీడియాకు తెలిపారు. రాష్ట్రం వెలుపల ఉన్న మరో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు తమకుందని.. మొత్తం 60 మంది తమ వైపే ఉన్నందున.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు తమకు వర్తించదని స్పష్టంచేశారు.


బుధవారం 58 మంది ఎమ్మెల్యేల మద్దతున్న రితబ్రతను సభాపతి ప్రతిపక్ష నేతగా గుర్తించడంతో టీఎంసీ అధికారికంగా చీలిపోయినట్లయింది. 1998లో టీఎంసీ ఆవిర్భవించాక పార్టీలో చీలిక ఇదే మొదటిసారి. పార్టీ, ఎన్నికల గుర్తు తమవేనని అసమ్మతి శిబిరం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేస్తే.. మమత నుంచి టీఎంసీ దూరం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి మమత తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్‌ నేత కునాల్‌ ఘోష్‌, కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా, మమత నాయకత్వాన్ని సవాల్‌ చేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు..సభాపతికి సమర్పించిన లేఖలో మాత్రం ఆమెను టీఎంసీ చైర్‌పర్సన్‌గా పేర్కొనడం గమనార్హం. మమతపై తిరుగుబాటుకు సారథ్యం వహిస్తున్న రితబ్రత సీపీఎంతో రాజకీయాలు ప్రారంభించారు. 2014లో సీపీఎం తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2020లో టీఎంసీలో చేరారు. మమత 2024లో మళ్లీ ఆయన్ను రాజ్యసభకు పంపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 07:20 AM