టీఎంసీకి ఎంపీలు బైబై?
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:54 AM
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మరో సంక్షోభం ముంగిట నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో.. మమతను ధిక్కరించి 58 మంది ఎమ్మెల్యేలు బుధవారం వేరుకుంపటి...
ఎమ్మెల్యేల బాటలోనే 20మంది పార్లమెంట్ సభ్యులు
బీజేపీలో చేరేందుకు సిద్ధం!.. అత్యున్నత స్థాయిలో చర్చలు
కోల్‌కతా, జూన్ 4: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మరో సంక్షోభం ముంగిట నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంతో.. మమతను ధిక్కరించి 58 మంది ఎమ్మెల్యేలు బుధవారం వేరుకుంపటి పెట్టుకోగా.. ప్రస్తుతం ఎంపీలు కూడా అదే బాటలో ఉన్నట్లు కనబడుతోంది. కనీసం 20 మంది ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అత్యున్నత స్థాయిలో ఈ దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మాజీ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బే అవుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీఎంసీకి లోక్‌సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. మమత అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యవిద్యార్థినిపై హత్యాచార ఉదంతంలో వ్యవహరించిన తీరును ఎంపీలు ఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే టీఎంసీ పరాజయానికి ప్రధాన కారణమని తప్పుబడుతున్నారు. వీరిలో అత్యధికులు గతవారం సీఎం సువేందు అధికారి నిర్వహించిన సమావేశానికి కూడా హాజరయ్యారు. ఉభయసభల్లోనూ టీఎంసీలో చీలిక తథ్యమని ఆ పార్టీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత పదవిని టీఎంసీ కోల్పోయింది. రెబెల్ నేత రుతవ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకుని దానిని కైవసం చేసుకున్నారు. మమతకు అత్యంత సన్నిహితుడైన ఫర్హద్ హకీమ్ బుధవారం కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేశారు. సువేందుతో మంతనాలు జరిపిన ఆయన ఆమెకు చెప్పి మరీ పదవి నుంచి వైదొలిగారు. తాజాగా విధాన్‌నగర్ మేయర్ కృష్ణ చక్రవర్తి కూడా రాజీనామా సమర్పించారు. ఈమె కూడా మమతకు అత్యంత సన్నిహితురాలు కావడం గమనార్హం. 16 ఏళ్లుగా కృష్ణ ఈ పదవిలో ఉన్నారు. తనకెవరిపైనా కోపం లేదని.. వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నానని, సాధారణ కౌన్సిలర్‌గా పనిచేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!