Share News

కార్పొరేటర్ దాడి.. మహిళా డాక్టర్ రాజీనామా

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:40 PM

మహారాష్ట్రలో వైద్యులపై కార్పొరేటర్ దాడి ఉదంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేటర్ చేయి చేసుకున్న మహిళా డాక్టర్ తాజాగా రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కార్పొరేటర్ దాడి.. మహిళా డాక్టర్ రాజీనామా
Woman Doctor Slapped By Corporator Resigns

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో వైద్యులపై కార్పొరేటర్ దాడి ఉదంతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేటర్ చేయి చేసుకున్న మహిళా డాక్టర్ సృష్టి తాజాగా రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు మరో డాక్టర్ కూడా రిజైన్ చేయడంతో మహిళా డాక్టర్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీకి చెందిన కార్పొరేటర్ రమేశ్ థానే జిల్లాలోగల ఒక ఆసుపత్రిలోని డాక్టర్లు సృష్టి, వైభవ్‌పై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ ఘటన నేపథ్యంలో వైభవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఇక్కడ భయానక వాతావరణం ఉంది. అందుకే రాజీనామా చేశా. ఆ గుండాలు నిరంతరం మమల్నే గమనిస్తున్నారు. వాళ్లు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. మిగతా డాక్టర్లు ఇక్కడ పనిచేయగలరేమో కానీ నా వల్ల మాత్రం కాదు’ అని వైభవ్ చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సృష్టి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే, వైభవ్, సృష్టిల రాజీనామాలు తమకు అందలేదని కేడీఎమ్‌సీ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

ఆసుపత్రిలోని శిశువును మరో హాస్పిటల్‌లో చేర్పించాలని ఇద్దరు వైద్యులు చిన్నారి కుటుంబసభ్యులకు సూచించడంతో వివాదం మొదలైంది. ఈ సూచనపై ఆగ్రహించిన కుటుంబసభ్యులు కార్పొరేటర్‌కు సమాచారం అందించారు. ఆ తరువాత ఆసుపత్రికి వచ్చిన కార్పొరేటర్ డాక్టర్లపై చేయిచేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.


ఈ వార్తలనూ చదవండి:

బిహార్‌లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

టీఎంసీకి మరో షాక్.. బీజేపీలోకి ముగ్గురు మాజీ రాజ్యసభ సభ్యులు

Updated Date - Jul 09 , 2026 | 09:00 PM