Share News

కులాల గోడలు బద్దలుకొడతాం

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:56 AM

ద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమని, కులాల మధ్య గోడలను కూల్చివేసేందుకే తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘యంగ్‌ ఇండియా’ స్కూళ్లను ప్రతిష్ఠాత్మకంగా...

కులాల గోడలు బద్దలుకొడతాం

ఆస్తులు, భూముల కంటే చదువే సామాజిక మార్పునకు కీలకం

  • తెలంగాణలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కీలకాంశం ఇదే

  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘యంగ్‌ ఇండియా’ స్కూల్‌

  • నీతి ఆయోగ్‌ భేటీలో రేవంత్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమని, కులాల మధ్య గోడలను కూల్చివేసేందుకే తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘యంగ్‌ ఇండియా’ స్కూళ్లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్‌ పాలక మండలి 11వ సమావేశంలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రస్తావిస్తూ..విద్యావిప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేంద్రం చెబుతున్న వికసిత్‌భారత్‌-2047 లక్ష్యాన్ని సాధించాలంటే.. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, ప్రతి పౌరుడికీ మెరుగైన వైద్య సేవలు లభించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది జనాభా, 242 కులాలకు సంబంధించిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో డబ్బులు, భూమి కంటే విద్యే సామాజిక ప్రగతిని ప్రభావితం చేస్తున్న అంశంగా తేలిందన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విద్యకు తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, రాష్ట్రంలో విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘గడచిన 75 ఏడ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశాం. కానీ నాణ్యమైన విద్యను అందించడం ఒక సవాలుగా మారింది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నాం. మా ప్రభుత్వం నిర్మించే యంగ్‌ఇండియా స్కూల్స్‌.. కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయన్న విశ్వాసం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకుంటారు. కలిసి జీవిస్తారు’ అని తెలిపారు.


ఏఐ యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు

కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. తయారీ, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్‌ రింగ్‌ రోడ్‌, రీజినల్‌ రింగ్‌ రైల్వే, గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. ఆనంద్‌ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని.. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌, హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు, సెమీ కండక్టర్‌ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్‌’ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ టాస్క్‌ఫోర్స్‌కు రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒక్కో నగరానికి రూ.లక్ష కోట్లు చొప్పున అందించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:56 AM