పీఓకేలో మారణహోమంపై దర్యాప్తు జరగాలి.. ఐరాసాలో పాక్‌ను ఎండగట్టిన కశ్మీరీ యువతి
ABN , Publish Date - Sep 23 , 2026 | 03:08 PM
పీఓకేలో సామాన్య పౌరుల్ని పాక్ దళాలు అన్యాయంగా పొట్టనపెట్టుకుంటున్నాయని కశ్మీరీ యువతి ఐక్యరాజ్య సమితిలో తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పీఓకేలో సామాన్య పౌరుల్ని పాక్ దళాలు అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నాయని ఓ కశ్మీరీ యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మారణహోమంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద బాధితుల కోసం పనిచేసే ఏటీవీకే సంస్థ తరఫున తస్లీమా అఖ్తర్ జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి 63వ సమావేశంలో తాజాగా ప్రసంగించారు. తమ కనీస హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరుల్ని పాక్ దళాలు చంపేస్తున్నాయని మండిపడ్డారు.
ఈ మధ్య కాలంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని ఆమె మానవ హక్కుల మండలి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక సమస్యల పరిష్కారానికి, తమ హక్కుల సాధనకు ఆవామీ యాక్షన్ కమిటీతో పాటు ఇతర పౌర సంస్థలు నిరసనలు చేపడుతున్నాయని తెలిపారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పాక్ భద్రతా దళాలు కాల్చి చంపుతున్నాయని ఆరోపించారు. ‘వందల మంది కార్యకర్తలను పాక్ దళాలు కాల్చి చంపాయి. కీలక నేతలను నిర్బంధించాయి. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అక్కడి రాజకీయ అస్థిరతకు, ప్రజల అసంతృప్తికి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి’ అని ఆమె అన్నారు.
పీఓకేలో పౌరులకు తమ గొంతు వినిపించే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యూఎన్ మానవ హక్కుల మండలి తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఈ దారుణాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలి. ప్రతి మరణం వెనకున్న నేపథ్యం, ఇతర వివరాలను అందరికీ తెలియజేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
పాక్ పాలకుల వైఫల్యాలను కూడా ఆమె ఈ సందర్భంగా ఎండగట్టారు. ‘భారత్‌లోని జమ్మూకశ్మీర్‌లో నైపుణ్యాలు మొదలు అన్ని కోణాల్లో అభివృద్ధి జరుగుతోంది. స్థానిక వ్యాపారులకు అవకాశాలు పెరిగాయి., స్మార్ట్ సిటీలు, గ్రామీణ మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధిని మరింత వేగవంతమైంది’ అని ఆమె చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
హానికర ఉత్పత్తుల ప్రచారంపై రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు
28న మదురైలో ‘మేనమామ ఉంగరం పథకం’