Share News

తమిళ సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:59 AM

ప్రముఖ తమిళ సాహితీవేత్త, సినీ పాటల రచయిత, కవి వైరముత్తు రామస్వామికి దే శంలోనే ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. అంతకుముందు 1975, 2002లో ఇద్దరు తమిళ సాహితీవేత్తలను...

తమిళ సాహితీవేత్త వైరముత్తుకు జ్ఞానపీఠ్ పురస్కారం

న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళ సాహితీవేత్త, సినీ పాటల రచయిత, కవి వైరముత్తు రామస్వామికి దే శంలోనే ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. అంతకుముందు 1975, 2002లో ఇద్దరు తమిళ సాహితీవేత్తలను ఈ అవార్డులు వరించాయి. 23 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాన్ని 73 ఏళ్ల వైరముత్తు అందుకోనున్నారు. తమిళ సాహిత్యానికి ఎనలేని సేవలు చేసి తన సృజనాత్మకతతో మెప్పించిన ఈయనకు 2025 సంవత్సరానికి 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రదానం చేయాలని శనివారం ఢిల్లీలో ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయనిర్ణేతల బృందం నిర్ణయించింది.


ప్రముఖ సాహితీవేత్తలు మాధవ్‌ కౌశిక్‌, దామోదర్‌ మోజో, ప్రఫుల్‌ షిలేదార్‌, కేశుభాయి దేశాయి, కె. శ్రీనివాసరావు, జానకీ ప్రసాద్‌ శర్మ, ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ ఎ. కృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ పురస్కారంలో భాగంగా వైరముత్తుకు రూ.11 లక్షల నగదు, జ్ఞాపికను బహూకరిస్తారు. ఈ సమావేశంలో రచయితలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ (తెలుగు), మహేశ్‌ ఎల్కుంచ్‌ వార్‌ (మరాఠీ), ప్రభావర్మ (మలయాళం) పేర్లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి.


కవితా సంకలనాలు, నవలలతో పాటు 37 గ్రంథాలు, దాదాపు 7,500 సినీ గేయాలు రచించిన వైరముత్తుకు పద్మభూషణ్‌, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ పురస్కారాలతోపాటు ఏడు సార్లు ఉత్తమ పాటల రచయితగా జాతీయ చలన చిత్ర పురస్కారాలు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు లభించాయి. 1991లో వచ్చిన సూపర్‌ హిట్‌ తమిళ సినిమా రోజాలో చిన్ని చిన్ని ఆసై పేరుతో బహుళ జనాదరణ పొందిన పాట రచయిత ఈయనే. ఈ సినిమా తర్వాత తెలుగులో డబ్‌ అయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:26 AM