తమిళనాట రికార్డు స్థాయిలో 85.14 శాతం పోలింగ్
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:02 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 85.14 శాతం ఓటింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించింది. గత ఎన్నికలతో (73.63%) పోలిస్తే ఈసారి...
గత ఎన్నికల్లో 73.63 శాతమే
చెన్నై, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 85.14 శాతం ఓటింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రకటించింది. గత ఎన్నికలతో (73.63%) పోలిస్తే ఈసారి 11.51% అత్యధికంగా నమోదైనట్లు తెలిపింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్.. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ముఖ్యంగా మహిళలు, యువత పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి 2 గంటల్లోనే 17.69% పోలింగ్ నమోదు కాగా.. సాయంత్రం 5 గంటలకు 82.24 శాతం నమోదైంది. సమయం ముగిసినా.. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి, ఓటు వేయడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో 85.14% పోలింగ్ జరిగినట్లు వెల్లడించింది. అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూంలకు తరలించారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. కాగా.. తమిళనాడు సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, టీవీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్, రజనీకాంత్, కమల్‌హాసన్, అజిత్‌కుమార్, త్రిష సహా పలువురు సినీ రంగ, ఇతర రంగాల ప్రముఖులంతా క్యూలలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండీ కూటమి, అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్‌డీఏ, హీరో విజయ్ ఆధ్వర్యంలోని ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ స్థాపించిన ‘ఆలిండియా పురచ్ఛి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం’ (ఏఐపీటీఎంఎంకే)’, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ వర్గం కలిసి పోటీ చేశాయి.
సినీ నిర్మాత సీమన్ నాయకత్వంలోని ‘నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే)’ కూడా బరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5,73,43,292 ఓటర్లుండగా.. మొత్తం 234 నియోజకవర్గాలకు గాను 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరూర్ జిల్లాలో అత్యధికంగా 92.62ు పోలింగ్ నమోదు కాగా.. కన్యాకుమారి జిల్లాలో అతి తక్కువగా 75.65% ఓటింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయ్యాక ఈ శాతాలు అటూఇటూ మారే అవకాశముంది. సీఎం స్టాలిన్ బరిలో నిలిచిన కొలత్తూర్‌లో 86.11%, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి పోటీచేస్తున్న చేపాక్-తిరువళ్లికన్నిలో 84.34% పోలింగ్ జరిగింది. మాజీ సీఎం పళనిస్వామి స్థానమైన సేలంలో రికార్డు స్థాయిలో 92.09% పోలింగ్ జరిగింది. విజయ్ పోటీచేస్తున్న పెరంబూర్‌లో 89.73% పోలింగ్ నమోదైంది.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి