విజయ్‌కు హంగ్ భంగం?
ABN , Publish Date - May 07 , 2026 | 06:55 AM
తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతోందా? ‘ద్రవిడ’ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ... రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు...
తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు
‘ద్రవిడ’ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగులు?
డీఎంకే, అన్నాడీఎంకే జట్టు కట్టే అవకాశం
మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం
ఐదుగురు సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వని గవర్నర్
పోస్ట్ ఎలక్షన్ అలయన్స్‌గా ద్రవిడ పార్టీల జట్టు!?
ఈ పార్టీలన్నింటికీ కలిపి 120 సీట్లు
అధికారాన్ని పంచుకోనున్న అన్నాడీఎంకే, డీఎంకే
తొలుత అన్నాడీఎంకే పళనిస్వామికి చాన్స్!
తమిళనాట రిసార్టు రాజకీయం.. 3 చోట్ల ఏర్పాటు
సంఖ్యా బలం లేదు.. విజయ్‌కు పిలుపు అక్కర్లేదు!
గవర్నర్‌కు రాజ్యాంగ నిపుణుడు బన్సోడే సలహా?
అవకాశమిస్తే ఫిరాయింపుల్ని ప్రోత్సహించినట్లే!
నాడు యడ్డీకి సుప్రీం ఒకరోజే గడువు: నిపుణులు
డీఎంకే-కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం
చెన్నై, మే 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోతోందా? ‘ద్రవిడ’ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే అయినప్పటికీ... రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు చేతులు కలపనున్నాయా? అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి... తొలి దెబ్బే ‘అదిరింది’ అనిపించి... తమిళనాడు ఎన్నికల్లో ‘విజిల్’ మోత మోగించిన ఇళయ దళపతి విజయ్‌కు ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరమవుతోందా? ద్రవిడ సిద్ధాంత మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డీఎంకే, అన్నా డీఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.... ఈ ప్రశ్నలన్నింటికీ ‘ఔను’ అనే సమాధానం లభిస్తోంది. త్రిముఖ పోరు జరిగి, ఏ పార్టీకీ మ్యాజిక్ మార్క్ దక్కకపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న తమిళనాడు రాజకీయ చిత్రం అనూహ్యమైన మలుపు తిరుగుతున్నట్లు సమాచారం! విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్, బీజేపీని మినహాయించి... డీఎంకే, అన్నా డీఎంకే, వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 234. అధికార సాధనకు కనీసం 118 సీట్లు కావాలి. కానీ... టీవీకే 108తో ఆగిపోయింది. అందులోనూ... విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి, అసలు బలం 107 మాత్రమే. అంటే, మరో 11 మంది మద్దతు ఉంటేనే సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.
విజయ్‌కి ఇప్పటిదాకా ఐదుగురు సభ్యుల బలమున్న కాంగ్రెస్ మాత్రమే అధికారికంగా మద్దతు ఇచ్చింది. అంటే... ఇంకా ఆరుగురు సభ్యులు తక్కువ! ప్రస్తుతానికి మరేపార్టీ విజయ్‌కి మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. ఇదీ విజయ్ పార్టీ పరిస్థితి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే... ఈ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలిచాయి. ఈ రెండు ప్రధాన ‘ద్రవిడ’ పార్టీల బలం 106. ఇక... ఈ రెండు కూటముల్లో ఏదో ఒకదానిలో భాగస్వాములుగా ఉన్న పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), డీఎండీకే (1), ఏఎంఎంకేఎంఎన్‌కేజడ్ (1) పార్టీలన్నింటికీ కలిపి... 14 సీట్లున్నాయి. వెరసి... డీఎంకే, అన్నా డీఎంకేతోపాటు ఆ కూటముల్లోని ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇదే జరిగితే... 108 స్థానాలున్న టీవీకే, ఇప్పటికే విజయ్‌కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ (5) నిస్సహాయంగా పక్కన ఉంటాయి. అన్నా డీఎంకే కూటమిలో భాగస్వామి అయినప్పటికీ... ఒకేఒక్క సీటున్న బీజేపీ మాత్రం ‘దీంతో మాకే సంబంధం లేదు’ అన్నట్లుగా చూస్తూ కూర్చునే అవకాశముంది. అంతేకాదు... టీవీకేను నిట్టనిలువుగా చీల్చి కనీసం 30 మందిని తమ పార్టీల్లో చేర్చుకునేందుకు డీఎంకే, అన్నా డీఎంకే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మలుపు తిరిగిందిక్కడే...
ప్రభుత్వ ఏర్పాటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి, ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి (ప్రీ ఎలక్షన్ అలయెన్స్) తొలి ప్రాధాన్యం ఉంటుంది. బల సమీకరణలో ఇవి విఫలమైతే... ‘పోస్ట్ ఎలక్షన్ అలయన్స్’ పేరుతో పార్టీలు జట్టుకట్టి... ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను కోరవచ్చు. ఇప్పుడు తమిళనాట ఇదే జరుగుతున్నట్లు సమాచారం! డీఎంకే, అన్నా డీఎంకే, ఇతర పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి... మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసే అవకాశముంది. ఈ పార్టీల ఉమ్మడి బలం 120. దీనిపై గవర్నర్ సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత నిర్దిష్ట గడువులోపు బల నిరూపణకు ఆదేశించవచ్చు. సభకు హాజరైన వారిలో కనీసం సగం మంది మద్దతు పలికితే చాలు... ప్రభుత్వం నిలబడినట్లే! అదే జరిగితే... మొదటి రెండున్నరేళ్లు అన్నా డీఎంకే నేత ఎడప్పాడి పళని స్వామి సీఎంగా ఉండే అవకాశముంది. ఆ తర్వాత రెండున్నరేళ్లు అధికార పగ్గాలు డీఎంకే చేపడుతుందని అంటున్నారు. అది... స్టాలిన్ కావొచ్చు, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా కావొచ్చు! పూర్తిగా కలిసిపోయాయనే ముద్ర పడకుండా... రెండు ద్రవిడ పార్టీలు ఒకదానికొకటి బయటి నుంచి మద్దతు ఇచ్చుకుంటాయని కూడా చెబుతున్నారు. వీటన్నింటిపైనా అతి త్వరలోనే స్పష్టత రానుంది.

కొసమెరుపు: ఇప్పుడైతే... అన్నా డీఎంకేతో ఎలాంటి చర్చలు జరగడంలేదని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ ప్రకటించారు. అయితే... ‘ఏం జరుగుతుందో చెప్పను. కానీ... ఏదో ఒకటి జరుగుతోంది. అది మాకు మంచే చేయబోతోంది’ అన్ని అన్నా డీఎంకేకు చెందిన ఒక కీలక నాయకుడు ‘ఆంధ్రజ్యోతి’తో అనడం గమనార్హం.
రిసార్టు రాజకీయం మొదలు
విజయ్ టీవీకే ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురం రిసార్టులో ఉంచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ ఆయనకు సూచించడంతో గురువారం ప్రమాణ స్వీకారం లేదని ఎమ్మెల్యేలకు అర్థమైంది. దీంతో వారు తమ స్వస్థలాలకు బయల్దేరారు. సాయంత్రానికి మళ్లీ వారిని వెనక్కి వచ్చేయాలని ఆయన ఆదేశించడంతో వారు తిరిగి రిసార్టుకు చేరుకున్నారు. ఇంకోవైపు.. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు రెండూ తమ ఎమ్మెల్యేలందరినీ పాండిచ్చేరి రిసార్టులకు తరలించడం విశేషం.
గవర్నర్ పాత్ర ఏమిటి?
అన్ని పార్టీలకంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న టీవీకేకు కాకుండా... గవర్నర్ ఇతర పార్టీలకు అవకాశమిస్తారా? అది రాజ్యాంగబద్ధమేనా? అనే ప్రశ్నలు తలెత్తవచ్చు. ‘హంగ్’ వంటి అనిశ్చితి, అస్పష్ట పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు. ఒక పార్టీకి లేదా కూటమికి ‘మ్యాజిక్ ఫిగర్’ వస్తే ఎలాంటి వివాదమూ ఉండదు. తేడావస్తే... ఏదైనా పార్టీలేదా కూటమి లోక్‌భవన్‌కు వెళ్లి, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరవచ్చు. ఏ పార్టీ ముందుకు రాకపోతే... ‘సింగిల్ లార్జెస్ట్’ పార్టీ అధినేతను గవర్నర్ పిలిపిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. తాను సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి... ప్రమాణ స్వీకారం తర్వాత వారంలోపు సభలో బలం నిరూపించుకోవాలని ఆదేశిస్తారు. బేరసారాలను నివారించేందుకు ఒక్కోసారి మూడు నాలుగు రోజులే సమయం ఇవ్వొచ్చు. ఇదంతా గవర్నర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే క్రమంలో... తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారని అంతా భావించారు. కానీ... గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ టీవీకేకు షాక్ ఇచ్చారు. ‘పిలిచి పీఠం అప్పగిస్తారు’ అని భావిస్తున్న టీవీకేకు మంగళవారమే భిన్నమైన అనుభవం ఎదురైంది. ‘ముందు వారి బలానికి సంబంధించిన వివరాలు ఇస్తే... అప్పుడు విజయ్‌తో భేటీపై నిర్ణయం తీసుకుంటాను’ అని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం సంచికలోనే వెల్లడించింది. బుధవారం లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్‌ని దీనిపైనే ప్రశ్నించారు. తమకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను విజయ్ గవర్నర్‌కు చూపించారు. ఇంకెవరూ టీవీకేకు మద్దతు పలకలేదు. తగిన బలం లేదని భావించిన గవర్నర్ అర్లేకర్... ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కి అవకాశం ఇవ్వలేదు. దీంతో తనకు మరింత సమయం ఇవ్వాలని గవర్నర్‌ను కోరి విజయ్ వెనుదిరిగారు.
ఎవరి బలం ఎంత?
టీవీకే 108
డీఎంకే 59
అన్నా డీఎంకే 47
కాంగ్రెస్ 5
పీఎంకే 4
ఐయూఎంఎల్ 2
సీపీఐ 2
సీపీఎం 2
వీసీకే 2
బీజేపీ 1
డీఎండీకే 1
ఏఎంఎంకే
ఎంఎన్‌కేజడ్ 1
మొత్తం 234
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ