Share News

డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి విచ్ఛిన్నం

ABN , Publish Date - May 07 , 2026 | 06:49 AM

అధికార పీఠానికి చేరువకు వచ్చినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కక పోవడంతో ఇరకాటంలో పడిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ దన్నుగా నిలిచింది. టీవీకేతో కలిసి...

డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి విచ్ఛిన్నం

  • 55 ఏళ్ల స్నేహాన్ని వదులుకున్న హస్తం

చెన్నై, మే 6(ఆంధ్రజ్యోతి): అధికార పీఠానికి చేరువకు వచ్చినా.. మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కక పోవడంతో ఇరకాటంలో పడిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్‌ దన్నుగా నిలిచింది. టీవీకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ప్రకటించింది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేతో కలిసి ఉంది. దాదాపు 55 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. కానీ.. టీవీకేతో పొత్తుకు సిద్ధమైన నేపథ్యంలో డీఎంకేతో కాంగ్రెస్‌ పార్టీ తన బంధాన్ని తెంచుకున్నట్టు అయింది. 1969లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి కట్టాయి. తమిళనాట సెక్యులర్‌, డ్రవిడ రాజకీయ పార్టీల హవా దాదాపు అర్ధశాతాబ్దానికి పైగా సాగింది. అయితే, మధ్యలో కొన్ని సందర్భాల్లో ఇరు పక్షాలు విడిపోయినా.. 2003 నుంచి మాత్రం చెలిమి కొనసాగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తమకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలన్న కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ను సీఎం స్టాలిన్‌ తిరస్కరించారు. అప్పటి నుంచే కాంగ్రె్‌సలో అసంతృప్తి మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైతం కాంగ్రెస్‌ ఇదేవిధమైన డిమాండ్‌ను స్టాలిన్‌ను ముదుంచింది. అధికారంలోకి వస్తే.. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. అయితే.. ఈ ప్రతిపాదనను కూడా స్టాలిన్‌ తిరస్కరించారు. ఈ క్రమంలో విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. 50 స్థానాలతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ టీవీకే అధినేత విజయ్‌ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆకర్షితులయ్యారు. అయితే, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిని దృష్టిలో పెట్టుకుని రాహుల్‌గాంధీ.. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సూచనను తిరస్కరించారు. అయితే, ఇప్పుడు విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్‌ భావించింది. దీనికి తోడు విజయ్‌-రాహుల్‌గాంధీ మధ్య ఉన్న స్నేహంతో ఎన్నికల ఫలితం అనంతరం విజయ్‌ తనకు మద్దతు కోసం ఆ పార్టీనే సంప్రదించారు. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర నేతలు, ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని బుధవారం తీర్మానించారు. ఈ పొత్తు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఏఐసీసీ ఇంచార్జ్‌ గిరీశ్‌ చోడంకర్‌ తెలిపారు. ఇదిలావుంటే, సీపీఎం కార్యదర్శి షణ్ముగం తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో బుధవారం ఉదయం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు తాము డీఎంకే కూటమిలోనే ఉన్నామని, తమను ఎవ్వరూ మద్దతు అడగలేదని షణ్ముగం వ్యాఖ్యానించారు. సీపీఐ సీనియర్‌ నేత డి. రాజా కూడా తమను ఎవ్వరూ మద్దతు కోరలేదని స్పష్టం చేశారు. మరోవైపు డీఎంకే మిత్రపక్షం వీసీకే ఆలోచనలో పడింది. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.


కాంగ్రె్‌సది వెన్నుపోటే: డీఎంకే

టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం పట్ల డీఎంకే తీవ్రస్థాయిలో స్పందించింది. ఇది తమకు వెన్నుపోటు లాంటిదేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. డీఎంకే అధికార ప్రతినిధులు టీకేఎస్‌ ఇళంగోవన్‌, శరవణన్‌ అన్నాదురై బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం దూరదృష్టిలేనిదని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ పార్టీ నేతలంతా భవిష్యత్తులో పశ్చాత్తాపడటం తథ్యమని వ్యాఖ్యానించారు.

స్టాలిన్‌తో రజినీకాంత్‌ భేటీ

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా స్థానిక ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన రజనీ.. స్టాలిన్‌ను ఓదార్చారు. ‘‘విజయాలు సాధించిన సమయంలోనే కాకుండా, కష్ట కాలంలోనూ మీ వెంటే ఉంటా.’’ అని ఈ సందర్భంగా రజనీ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 06:49 AM