Share News

పాస్టర్‌కు 4 మరణశిక్షలు!

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:14 AM

నలుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు నాలుగు మరణశిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్‌ ఇలందైకుళం ప్రాంతంలో...

పాస్టర్‌కు 4 మరణశిక్షలు!

  • పోక్సో కేసులో తిరునల్వేలి ప్రత్యేక కోర్టు తీర్పు

  • నైతిక విలువల తరగతుల సాకుతో

  • నలుగురు బాలికలపై మతబోధకుడి అత్యాచారం

  • బాధితులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం

  • చెల్లించాలని తమిళనాడు సర్కారుకు కోర్టు ఆదేశం

చెన్నై, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నలుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ మతబోధకుడికి పోక్సో కోర్టు నాలుగు మరణశిక్షలు విధించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేల్‌ ఇలందైకుళం ప్రాంతంలో ప్రార్థనా మందిరాన్ని నడుపుతున్న అబ్రహం(50) అనే మత బోధకుడు సెలవుల సమయంలో నైతిక విలువలకు సంబంధించిన తరగతుల సాకుతో బాలికలను లైంగికంగా వేధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించడంతో వారు గంగైకొండాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు పంపారు. ఈ కేసును విచారించిన తిరునల్వేలి జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి సురేశ్‌ కుమార్‌ గురువారం అబ్రహంకు నాలుగు మరణశిక్షలు విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. నిందితుడికి రూ.52వేలు జరిమానా విధించారు. అత్యాచారానికి గురైన బాలికలు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, బాలికలపై అబ్రహం వేధింపులు 2019 కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలోనే ప్రారంభమయ్యాయని, 2022లో అతడి నిర్వాకంపై ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేవరకూ కొనసాగాయని జిల్లా ఎస్పీ విశ్వేశ్‌ బాలసుబ్రమణియన్‌ శాస్త్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:14 AM