కాంగ్రెస్ మద్దతు విజయ్‌కేనా?.. కె.సి.వేణుగోపాల్ ఏం చెప్పారంటే..
ABN , Publish Date - May 06 , 2026 | 08:40 AM
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడులో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడులో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)కి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ స్పష్టం చేశారు.
విజయ్ మద్దతు కోరుతూ కాంగ్రెస్‌ను సంప్రదించారని, ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు మంగళవారం నాడు భేటీ అయినట్లు కె.సి. వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో తనతోపాటు రాహుల్ గాంధీ, తమిళనాడు ఇన్‌ఛార్జ్ గిరీశ్ చోడంకర్ సహా పలువురు నేతలు సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ లేదా దాని అనుబంధ సంస్థలు నడపాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల తీర్పును, రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని టీఎన్‌సీసీని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు కె.సి. వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా, తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 108 స్థానాలను టీవీకే పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఐదు స్థానాలు కైవసం చేసుకుంది. డీఎంకే 59 సీట్లు, ఏఐఏడీఎంకే 47 సీట్లు సాధించాయి. ఇతర చిన్న పార్టీలు మరికొన్ని స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
విజయ్ హామీలకు లక్ష కోట్లు కావాలి!
పంజాబ్‌లో రెండు భారీ పేలుడు ఘటనలు.. అప్రమత్తమైన భద్రతా దళాలు..