విజయ్ హామీలకు లక్ష కోట్లు కావాలి!
ABN , Publish Date - May 06 , 2026 | 07:14 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే...
ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడనున్న భారం ఇదీ
నిధులు ఎక్కడినుంచి వస్తాయని అధికారుల ఆందోళన
హామీల అమలు అంత సులభం కాదని అభిప్రాయం
ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటులో రాష్ట్రం
ఖజానాపై అదనంగా పడనున్న భారం
నిధుల సమీకరణపై అధికారుల ఆందోళన
(చెన్నై-ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో రూ.లక్ష కోట్ల అదనపు భారం పడటం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటి అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు నెలవారీ సాయం రూ.1,000 నుంచి రూ.2,500కు పెంచాలన్న హామీతో వార్షిక వ్యయం రూ.14,411 కోట్ల నుంచి రూ.36,029 కోట్లకు పెరుగుతుంది. అంటే ప్రభుత్వంపై అదనంగా రూ.21,618 కోట్ల భారం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది.
ఈ వ్యయం ఏడాదికి రూ.7,752 కోట్ల నుంచి రూ.12వేల కోట్లు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం రూ.4,248 కోట్లు పైమాటే. ఇక వృద్ధులకు పింఛను కింద ప్రస్తుతం రూ.1,200 ఇస్తుండగా, దానిని రూ.3 వేలకు పెంచడం వల్ల వార్షిక వ్యయం రూ.4,366 కోట్ల నుంచి రూ.6,549 కోట్లకు పెరగనుంది. వితంతు పింఛన్లకు రూ.1,829 కోట్లు, దివ్యాంగుల పింఛన్లకు రూ.504 కోట్ల చొప్పున భారం పెరగనుంది. ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీతో రూ.7,074 కోట్లు, రైతులకు ఏడాదికి రూ.15,000 పంపిణీతో రూ.1,941 కోట్లు, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో అదనంగా రూ.382 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ఇక నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం (దాదాపు రూ.1,20,000) హామీతో రూ.600 కోట్లకు పైగా వ్యయం పెరుగుతుంది.
ప్లస్-2 చదివిన వారికి ప్రతి నెలా రూ.2500, నిరుద్యోగ యువతకు రూ.4,000, ఇంటర్న్‌షిప్ చేసేవారికి నెలకు రూ.5,000 నుంచి రూ.8,000 వరకూ స్టయిపెండ్, చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ప్రతి నెలా రూ.27,000, చేపల వేటకు వెళ్లే పడవలకు రాయితీతో కూడిన డీజిల్, వితంతువులు, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.18,000, పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.10,000 జీతం వంటి వాటివల్ల కూడా అదనపు భారం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలును పరిశీలిస్తామని టీవీకే పేర్కొంది. 5లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది.
ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులతో సహా అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలు, హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏటా లోటు బడ్జెట్ దాఖలవుతుండగా, ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడినుంచి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటు ఉంది. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విజయ్ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్